Locations: Hyderabad

  • ‘రుణ వేధింపులకు భయపడొద్దు’

    HYD: రుణ యాప్‌ల వేధింపులపై ప్రతినెలా 5-10 ఫిర్యాదులు వస్తున్నాయని సైబర్‌క్రైమ్ డీసీపీ కవిత దార తెలిపారు. యాప్‌ల షరతులు సరిగ్గా పరిశీలించకుండా రుణాలు తీసుకుంటే ఇలాంటి పరిణామాలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రుణంతీసుకునే ముందు యాప్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అలాగే ఫోన్ యాక్సెస్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వేధింపులకు భయపడకుండా వాటిని రికార్డ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

  • ఖైరతాబాద్ బడా గణేశుడి చోటా రూపం(VIDEO)

    HYD: మాసబ్ ట్యాంక్‌లోని ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో మూడవ సంవత్సరం విద్యార్థి అయిన సంపత్ అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించాడు. ప్రపంచంలోనే అతిపెద్ద గణేశుడిగా పేరుగాంచిన ఖైరతాబాద్ గణేశ్ విగ్రహాన్ని కేవలం 5.5 సెంటీమీటర్ల పొడవున్న చాక్‌పీస్‌పై సూక్ష్మంగా చెక్కాడు. ఈ చిన్న విగ్రహాన్ని తయారు చేయడానికి సంపత్ 32 గంటలు శ్రమించినట్లు తెలిపారు. ఈ కళాఖండం కళాభిమానులనే కాకుండా, సామాన్య ప్రజలను కూడా ఆశ్చర్యపరిచింది.

  • భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

    హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.880 పెరిగి రూ.1,06,970కు చేరుకుంది. 9 రోజుల్లో రూ.5,460 పెరగడం గమనార్హం. 22 క్యారెట్ల బంగారం ధర రూ.800 పెరిగి రూ.98,050 వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర కూడా రూ.900 పెరిగి రూ.1,37,000 వద్ద ఉంది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.

     

  • HYD ఐటీ కారిడార్‌లో పెరిగిన ఇంటి అద్దెలు

    హైదరాబాద్ ఐటీ హబ్‌గా మారడంతో మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో నివాస గృహాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ఒకప్పుడు కుగ్రామం అయిన మాదాపూర్, ఇప్పుడు గ్లాస్ టవర్లు, అపార్ట్‌మెంట్‌లతో నిండిపోయింది. నాలుగేళ్ల క్రితం రూ. 23 వేలు ఉన్న 2BHK ఫ్లాట్ అద్దె ఇప్పుడు రూ. 35 వేలకు చేరింది. గేటెడ్ కమ్యూనిటీలలో 3BHK అద్దె రూ. 50వేలకు పెరిగింది. ఈపెరుగుదలకు ఐటీకంపెనీల విస్తరణే ప్రధాన కారణం.

  • ఆ 5 నిమిషాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి!

    ప్రతిరోజూ కేవలం ఐదు నిమిషాల పాటు తీవ్రమైన వ్యాయామం చేస్తే మరణ ప్రమాదాన్ని ఆరేళ్లు తగ్గించవచ్చని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ పరిశోధకులు వెల్లడించారు. ఈ తరహా శారీరక శ్రమ గుండె సంబంధిత వ్యాధుల మరణాలను గణనీయంగా తగ్గిస్తుందని వారు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఏటా ప్రపంచవ్యాప్తంగా 18 మిలియన్ల మంది గుండె జబ్బులతో చనిపోతున్నారు.

  • ఎన్‌హెచ్‌పీసీలో 248 ఉద్యోగాలకు నోటిఫికేషన్

    HYD: నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHPC) 248 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈపోస్టుల్లో అసిస్టెంట్ రాజ్‌భాష ఆఫీసర్, జేఈ, సీనియర్ అకౌంటెంట్, సూపర్వైజర్ (ఐటీ), హిందీ ట్రాన్స్‌లేటర్ వంటివి ఉన్నాయి. దరఖాస్తుదారుల వయసు 30ఏళ్లు మించకూడదు. పోస్టును బట్టి డిగ్రీ, బీ.టెక్,సీఏ అర్హతలుగా నిర్ణయించారు.ఎంపికైన వారికి రూ.27,000నుంచి రూ.1,40,000వరకు జీతం ఉంటుంది. వచ్చేనెల 1లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

     

  • ప్రేమించి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మోసం.. 20 ఏళ్ల జైలు

    HYD: ఒడిశాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ స్వాగత్ కుమార్‌ను ప్రేమించిన యువతికి న్యాయం లభించింది. ఆమెను ప్రేమ పేరుతో లోబర్చుకుని, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి నిలదీయగా, ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం స్వాగత్ కుమార్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

  • చేవెళ్ల వాగులో కారు బోల్తా.. ఒకరు మృతి

    రంగారెడ్డి: చేవెళ్ల మండల కేంద్రానికి చెందిన బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు నితీష్ రెడ్డి (25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నిన్న రాత్రి చేవెళ్ల-పామెన రోడ్డులో కారులో వెళ్తుండగా అదుపుతప్పి కారు కాల్వలో పడిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో కారును బయటికి తీసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • పిల్లల్లో పెరుగుతున్న డిజిటల్ వినియోగం..

    హైదరాబాద్‌లోని పిల్లలు అధికంగా డిజిటల్ స్క్రీన్‌లను వినియోగించడం ఆందోళన కలిగిస్తోంది. ఇది వారిపై తీవ్రప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్క్రీన్ సమయాన్ని కట్టడి చేయకపోతే పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతిని మాట ఆలస్యం,భావోద్వేగ లోపం లాంటి వర్చువల్‌ ఆటిజం లక్షణాలు, నిద్రలేమి, ఊబకాయం, దృష్టిలోపాలు వంటి సమస్యలు ఎదురవుతాయి. తల్లిదండ్రులు పిల్లలకు కథలు చెప్పడం, క్రీడలు, పజిల్స్,డ్రాయింగ్‌ అలవాటు చేయించాలని సూచిస్తున్నారు.

  • సూసైడ్ ఆలోచన వద్దు బ్రో.. ఒక్కసారి కాల్ చేయండి..!

    జీవితంలో కష్టాలు సహజమని, ఆత్మహత్యలు చేసుకుంటే పరిష్కారం కాదని పెద్దలు చెబుతుంటారు. ఇటీవల ఆత్మహత్యల సంఖ్య పెరగడంతో తెలంగాణ సైకలాజికల్ అసోసియేషన్  స్పందించింది. ఆత్మహత్య ఆలోచనలతో బాధపడేవారికి ఆత్మస్థైర్యం కల్పించేందుకు నగరంలో రెండు హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ఆత్మహత్య ఆలోచనలు ఉన్నవారు 040-35717915, 94404 88571 నంబర్లకు ఫోన్ చేసి, నిపుణుల సహాయం పొందవచ్చని అసోసియేషన్ తెలిపింది.