Locations: Hyderabad

  • OUలో సెక్యూరిటీపై దాడి చేసిన నకిలీ IAS అరెస్ట్

    HYD: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) క్యాంపస్‌లో నకిలీ ఐఏఎస్ అధికారి సెక్యూరిటీ గార్డుపై దాడి చేశాడు. ఓయూ ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ వద్ద యూరిన్ పోస్తుండగా, సెక్యూరిటీగార్డు సాయినాథ్ అతడిని అడ్డుకున్నాడు. దాంతో, తాను ఐఏఎస్ అధికారిని అంటూ వాదిస్తూ..తనతో ఉన్న వ్యక్తులతో కలిసి సాయినాథ్‌పై దాడికి పాల్పడ్డాడు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో.. ఓయూ పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

  • రైలు కింద పడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

    హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పట్నాయక్ (28) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇతను హైదరాబాద్‌లోని తన సోదరి ఇంట్లో ఉంటూ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతను చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

     

  • హనీట్రాప్‌.. రూ.లక్ష మోసం

    HYD: ఆసిఫ్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు సైబర్‌ నేరగాళ్ల హనీట్రాప్‌కు బలయ్యాడు. ఓ మహిళ నుంచి వీడియోకాల్ వచ్చిన తర్వాత, అతని నగ్నవీడియోలను రికార్డ్ చేసి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. పోలీసులు, యూట్యూబ్ అధికారులమని చెప్పుకుంటూ దశలవారీగా అతని నుంచి లక్ష రూపాయలు వసూలు చేశారు. చివరికి మరికొంత డబ్బు అడగడంతో బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

  • ఆ బిర్యానీ ఆరోగ్యానికి హానీ..

    హైదరాబాద్ బిర్యానీకి ఉన్న పేరును అడ్డుపెట్టుకుని కొన్ని హోటళ్లు నాసిరకం బిర్యానీ అమ్ముతున్నాయి. ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బిర్యానీ తయారీకి గడువు ముగిసిన పదార్థాలను, హానికర రసాయనాలను వాడుతున్నారని గుర్తించారు. ఈ చర్యలు ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఆహారం రుచికరంగా ఉన్నప్పటికీ, దాని నాణ్యతను జాగ్రత్తగా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.

  • పాతబస్తీలో RAF ఫ్లాగ్ మార్చ్

    హైదరాబాద్ పాతబస్తీలోని మీర్‌చౌక్ డివిజన్‌లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్(RAF) ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సీ.వీ. ఆనంద్, డీసీపీ సౌత్ జోన్ స్నేహ మెహ్రా ఆధ్వర్యంలో ఈ మార్చ్ జరిగింది. శాంతిభద్రతల పర్యవేక్షణ, ప్రజల్లో భద్రత పట్ల విశ్వాసం పెంచే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఫ్లాగ్ మార్చ్‌కు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నాయకత్వం వహించారు.

  • REWIND: ఖైరతాబాద్ గణేశుడి ముందు కమల్ డాన్స్

    కళాతపస్వీ విశ్వానాథ్ దర్శకత్వంలో 1983లో విడుదలైన ‘సాగర సంగమం’ చిత్రంలో హీరో కమల్ హాసన్ ఖైరతాబాద్ గణేశుడి ముందు శాస్త్రీయ నృత్యం చేశారు. ఈ అద్భుతమైన సన్నివేశాన్ని వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో భారీ విజయం సాధించిన ఈ చిత్రం, ఈనాటికీ కూడా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. అరుదైన జ్ఞాపకాన్ని నెమరువేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

     

  • మ్యాట్రిమోనీ పెళ్లి సంబంధాలపై జాగ్రత్త!

    హైదరాబాద్ పోలీసులు కీలక హెచ్చరిక జారీ చేశారు. పెళ్లి సంబంధం కోసం మ్యాట్రిమోని సైట్లలో వెతికేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ‘‘మ్యాట్రిమోని వెబ్‌సైట్లలో కనిపించే ప్రొఫైల్స్ అన్నీ నిజం కాదు. దీన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతుంటారు. వారి మాటలను నమ్మి పెట్టుబడులు పెట్టకండి’’ అని సూచించారు. ఇటీవల అందమైన అమ్మాయిల ప్రొఫైల్ ఫొటో పెట్టి బురిడీ కొట్టిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

  • IT కారిడార్‌లో ఇంటి అద్దెలకు రెక్కలు

    HYD: హైటెక్‌సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో అనేక IT కంపెనీలు ఉండటంతో ఉద్యోగుల నుంచి నివాస గృహాలకు డిమాండ్‌ పెరిగింది. గత ఐదేళ్లలో హైటెక్‌ సిటీ ప్రాంతంలో ఇళ్ల అద్దెలు 50 శాతానికి పెరిగాయని రియల్‌ ఎస్టేట్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. సింగల్‌ బెడ్‌రూమ్‌ అద్దె ఇప్పుడు రూ.20 నుంచి 25వేలకు పెరిగింది. వెయ్యి చదరపు అడుగుల 2BHK ఫ్లాట్‌ అద్దె రూ.35వేల వరకు ఉంది.

  • నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన: సీపీ మహంతి

    HYD: వినాయక నిమజ్జనం కోసం కూకట్‌పల్లిలోని ఐడీఎల్, ప్రగతినగర్ చెరువుల వద్ద ఏర్పాట్లను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి పరిశీలించారు. భక్తుల సౌకర్యం, భద్రతకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

  • హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి ముఖ్య అతిథిగా అమిత్ షా!

    కేంద్రమంత్రి అమిత్ షా సెప్టెంబర్ 6న హైదరాబాద్‌లో జరిగే గణేష్ నిమజ్జనానికి ఊరేగింపులో ముఖ్య అతిథిగా పాల్గొననున్నట్లు సమాచారం.శనివారం జరగనున్న గణేష్ నిమజ్జన ఊరేగింపు శోభా యాత్రకు ముఖ్య అతిథిగా పాల్గొనాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి హోంమంత్రిని ఆహ్వానించింది. కాగా నిమజ్జన కార్యక్రమంలో రెండు ప్రాంతాల్లో ఆయన ప్రసంగిస్తారు.