Locations: Hyderabad

  • తన భార్యపై కన్ను వేశాడన్న అనుమానంతో హత్య

    HYD: మూసీ నదిలో కొట్టుకు వచ్చిన మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. తనభార్యపై కన్ను వేశాడన్న అనుమానంతో స్నేహితుడు షోరబ్‌ను మహమ్మద్ జావిద్, అమీరుల్ హాక్‌తో కలిసి హత్యచేసినట్లు అంబర్‌పేట డీసీపీ బాలస్వామి తెలిపారు. పథకం ప్రకారం మద్యంతాగించి, వైర్లతో ఊపిరి ఆడకుండా చేసి మూసీలో పడవేశారని చెప్పారు. షోరబ్ స్నేహితుడి ఫిర్యాదుతో దర్యాప్తుచేసి ఇద్దరునిందితులను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

  • మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య

    మేడ్చల్: ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎదులాబాద్ గ్రామానికి చెందిన ఆముద సంతోష్ (25) ఇంట్లో ఎవరూలేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గత కొంతకాలంగా సంతోష్ మద్యానికి బానిసై, ఎలాంటిపని లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు అతని తల్లి రోజా ఫిర్యాదులో పేర్కొంది. ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • నారాయణగూడలో రద్దైన నోట్ల పట్టివేత

    HYD: నారాయణగూడలో ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా రద్దైన నోట్లను పట్టుకున్నారు. శాంతి థియేటర్ ఎదురుగా కెనరా బ్యాంక్ వద్ద ఇద్దరిని, వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న మూడు బ్యాగుల్లో రెండు కోట్ల రూపాయల విలువైన రద్దైన 500, 1000 నోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

     

  • ‘స్వస్తు నారి స్వశక్త్ పరివార్ అభియాన్’ మెగాహెల్త్ క్యాంప్

    వికారాబాద్: ‘స్వస్తు నారి స్వశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లావైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ K .లలితాదేవి తెలిపారు. ఈ నెల 17నుండి అక్టోబర్ 2వతేదీ వరకు కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా ఆ తేదీలలో మెగాహెల్త్ క్యాంపులు నిర్వహిస్తారు. ప్రతిరోజు పది ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి మహిళల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన అన్ని రకాల వైద్యసేవలు అందిస్తారని  పేర్కొన్నారు.

  • ‘ప్రభుత్వ పాఠశాలలకు ప్రోత్సాహకాలు’

    మేడ్చల్: కీసర మండలంలో విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రోత్సాహకాలు అందించడం అభినందనీయమని సీఐ ఆంజనేయులు అన్నారు. పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక ఉత్తీర్ణత సాధించిన నాగారం ZPHS పాఠశాలకు ఎస్‌ఎస్‌సీ చాలెంజ్ ట్రోఫీ, మెమెంటో, రూ. 11 వేల నగదు బహుమతిని మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, న్యాయవాది బోడ శ్రీనివాసరావుతో కలిసి అందజేశారు. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత ఫలితాలు సాధించాలని సూచించారు.

  • పదవులు, నిధులు కేటాయించాలి: బండిరమేష్

    HYD: గాంధీ భవన్‌లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బండిరమేష్ పాల్గొన్నారు. జనాభా ప్రాతిపదికన తమ నియోజకవర్గానికి పదవులు, నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. జై భీమ్-జై బాపు వంటి పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ విజయంకోసం కృషి చేస్తామని, కూకట్‌పల్లికి డైరెక్టర్ పదవులు ఇవ్వాలని కోరారు.

  • విద్యా వ్యవస్థలో మార్పుల కోసం అధ్యయనం

    వికారాబాద్‌: రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సోమవారం వికారాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, డైట్ కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సమూల మార్పుల కోసం అధ్యయనం చేస్తున్నామని ఆయన తెలిపారు. మౌలిక వసతులు, అధ్యాపకులు, విద్యార్థుల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామని మురళి చెప్పారు.

  • రోడ్డు దాటుతుండగా కారు ఢీ.. వృద్దురాలు స్పాట్‌లోనే..

    మేడ్చల్: ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కారు ప్రమాదంలో 77 ఏళ్ల వృద్ధురాలు దాచారం మల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. సిద్దిపేట జిల్లాకు చెందిన ఆమె ఔషాపూర్ వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా..వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టింది. ఇదే కారు మరో ద్విచక్ర వాహనాన్ని కూడా ఢీకొట్టడంతో దానిపై ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • నేత్రదానానికి టీజీఎస్ఆర్టీసీ చేయూత

    TG: సామాజిక బాధ్యతలో భాగంగా టీజీఎస్ఆర్టీసీ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేత్రదానానికి తోడ్పాటు అందించేందుకు హైదరాబాద్‌లోని స‌రోజిని దేవి కంటి ఆసుప‌త్రితో సోమవారం ఒప్పందం కుదుర్చుకుంది. ‘నెట్‌వర్క్ టు సైట్’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం కింద, వివిధ జిల్లాల నుంచి సేకరించిన కార్నియాలను ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా హైదరాబాద్‌లోని కంటి ఆసుపత్రికి తరలిస్తారు.

  • పేదరికంపై గెలిచి ఐఐటీలో సీటు సాధించిన నిరంజన్

    హైదరాబాద్‌కు చెందిన నిరంజన్ అనే యువకుడు తన తల్లిదండ్రుల పేదరికాన్ని అధిగమించి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీటు సాధించాడు. రోజువారీ కూలీలైన అతని తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ, నిరంజన్ తన ప్రతిభతో దాన్ని అధిగమించాడు. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సంస్థ పాఠశాలలో చదువుకున్న అతడు పగలు తరగతులకు, రాత్రిపూట ఆన్‌లైన్ శిక్షణ తరగతులకు హాజరయ్యేవాడు. ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 1668 ర్యాంకు సాధించాడు.