Locations: Hyderabad

  • గణపతి దేవాలయంలో సాంస్కృతి కార్యక్రమాలు

    HYD: గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో ఆధ్యాత్మిక, సాంస్కృతి, దార్మిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. భూదన్ పోచంపల్లి వంకమామిడి గ్రామానికి చెందిన బడుగు నిఖిత కూచిపూడి నృత్య ప్రదర్శన చేసి అందరిని ఆకట్టుకుంది. రమేష్ బాబు శిష్యరికంలో కూచిపూడిలో శిక్షణ పొందిన నిఖిత అనేక ప్రదర్శనల ద్వారా ఆహుతులను అలరించింది.

  • JNTU-జర్మనీ కోర్సు స్పాట్‌ ప్రవేశాలకు స్పందన కరవు

    HYD: జేఎన్‌టీయూ-జర్మనీ వర్సిటీల ఎంవోయూ కోర్సుల్లో ప్రవేశానికి సోమవారం ప్రారంభమైన మరోవిడత స్పాట్‌ కౌన్సెలింగ్‌కు స్పందన కరవైంది. రెండేళ్ల డబుల్‌ డిగ్రీ మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ రెనెవబుల్‌ ఎనర్జీ అండ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ, ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌ కోర్సుల్లో  ఒక్కసీటు భర్తీ కాకపోవడం గమనార్హం. ఈస్పాట్‌ కౌన్సెలింగ్‌ 4వతేదీ వరకు కొనసాగుతుందని వర్సిటీ ప్రవేశాల విభాగం డైరెక్టర్‌ కె.బాలునాయక్‌ చెప్పారు.

  • స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

    HYD: బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరగాయి. హైదరాబాద్‌లోని బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 210 పెరిగి రూ.1,06,090కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 200 పెరిగి రూ. 97,250గా పలుకుతోంది. ఇటు కేజీ వెండి ధర రూ.1,36,100గా ఉంది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

  • నిజాం కాలం నాటి ‘బ్యారెక్స్‌’.. నేడు ‘బార్కస్‌’.. చరిత్రపై ఓ లుక్కేయండి!

    నిజాం పాలనలో యెమెన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుండి వచ్చిన అరబ్బులు, పఠాన్లు నిజాం సైన్యంలో పనిచేసేవారు. వారు కింగ్‌కోఠి నుంచి పాతబస్తీలోని తమ బసకు ఆయుధాలతో వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. దీనితో నిజాం రాజువారి కోసం చాంద్రాయణగుట్ట దగ్గర ఆయుధాలు భద్రపరిచేందుకు ఒక గోదాం(బ్యారెక్స్) ఏర్పాటుచేశారు. ఆ ప్రాంతంలోనే నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించారు. కాలక్రమేణా ‘బ్యారెక్స్’ అనే పేరు ‘బార్కస్’గా మారింది.

  • నిరుద్యోగులూ.. మీకు తెలుసా?

    HYD: బడంగ్‌పేటలోని దావూద్‌ఖాన్‌గూడలో ఉన్న జిల్లాకేంద్ర గ్రంథాలయం నిరుద్యోగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లుచేసింది. ఇక్కడ ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే వారికి ఉచిత వైఫై, ప్రత్యేకగదులు, కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి. మహిళల కోసం ప్రత్యేకంగా రెండంతస్తుల్లో ఏర్పాట్లు చేయడం విశేషం. ఇక్కడ గ్రూప్స్, ఆర్‌ఆర్‌బీ, ఎస్సై, కానిస్టేబుల్ వంటి అనేక పరీక్షలకు సంబంధించిన 8,240 పుస్తకాలు ఉన్నాయి. ఇప్పటివరకు 50 మంది ఇక్కడ చదివి ఉద్యోగాలు సాధించారు.

  • పోలీసులపై దాడి.. ముగ్గురు అరెస్టు

    HYD: వనస్థలిపురం పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ లింగం, హోమ్ గార్డ్ యాదయ్య లపై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. చింతలకుంటలో అర్ధరాత్రి వరకు టిఫిన్ సెంటర్ నడుపుతుండటంతో డ్యూటీలో భాగంగా పోలీసులు వారిని ప్రశ్నించారు. దీంతో టిఫిన్ తినేందుకు వచ్చిన రాకేష్, ప్రసాద్‌లు దాడికి దిగారు. కానిస్టేబుల్ ఫిర్యాదుతో వనస్థలిపురం పోలీసులు వారితో పాటు పవణ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

     

  • పిల్లలకు సమయం కేటాయించండి ఇలా.. 7-7-7 ఫార్ములా!

    HYD: పిల్లలతో రోజంతా గడపలేకపోయినా, రోజులో మూడుసార్లు 7 నిమిషాలు వారికి కేటాయిస్తే మానసిక, శారీరక ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఉదయం వారితో కొంత సమయం గడిపితే రోజంతా సానుకూలంగా ఉంటారు. సాయంత్రం వారి అనుభవాలు తెలుసుకోవడం, రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కథలు చెప్పడం వంటివి చేయాలి. ఇలాచేయడం వల్ల వారిలో భద్రత భావం పెరుగుతుంది. ఇది పిల్లలు, తల్లిదండ్రుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది.

  • BJP జిల్లా ఉపాధ్యక్షుడిగా రాహుల్‌చంద్ర

    BJP హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా ఉపాధ్యక్షుడిగా జేఎల్‌ రాహుల్‌చంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్‌రెడ్డి ఆయన నియామకాన్ని ప్రకటించారు. రాహుల్‌చంద్ర గతంలో పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యదర్శిగా రెండుసార్లు, నగర పార్టీ ఉపాధ్యక్షుడిగా రెండుసార్లు వ్యవహరించారు.

  • లండన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌ యువకులు దుర్మరణం

    లండన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు మృతిచెందారు. రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు నాదర్‌గుల్‌కు చెందిన తర్రె చైతన్య (22), ఉప్పల్‌కు చెందిన రిషితేజ (21)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

     

     

  • వాట్సప్‌ ఫిర్యాదుతో చెత్త సమస్య పరిష్కారం

    హైదరాబాద్‌లో పెరుగుతున్న చెత్త సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్‌ఎంసీ కొత్త పరిష్కారం తీసుకొచ్చింది. వాట్సప్‌ నంబర్‌ (81259 66586)ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నంబర్‌కు ‘హాయ్’ అని పంపి, వచ్చే లింక్‌లో చెత్త సమస్య ఉన్న ప్రాంతం, దాని ఫోటో, లొకేషన్ వివరాలు పంపవచ్చు. ఈ నంబర్ కేవలం పారిశుధ్య సమస్యల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. దీంతో ప్రజలు సులభంగా ఫిర్యాదు చేయవచ్చు.