Locations: Hyderabad

  • నాడు సాగు భూమి.. నేడు క్రికెట్‌ మైదానం

    హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో క్రికెట్ మైదానాలకు డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పుడు సాగు భూమిగా ఉన్న పొలాలు ఇప్పుడు క్రికెట్ మైదానాలుగా రూపాంతరం చెందుతున్నాయి. బౌరంపేటలో ఒక రైతు తన పొలాన్ని ఇలా మార్చారు. 20-25 ఓవర్ల మ్యాచ్‌కి సాధారణ రోజుల్లో రూ.2,000 వరకు, ఫ్లడ్‌లైట్లతో రూ.6,000, వారాంతాల్లో రూ.8,000 వరకు అద్దె వసూలు చేస్తున్నారు. ఇది రైతులకు మంచి ఆదాయ మార్గంగా మారింది.

     

  • ‘ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి’

    HYD: గణేశ్ నిమజ్జనం సందర్భంగా ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. మధురానగర్ పీఎస్‌లో ఆయన నిమజ్జన బందోబస్తుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అసాంఘిక శక్తులు, ఈవ్ టీజింగ్, గొలుసు దొంగతనాలు, పాకెటింగ్ వంటి నేరాలను అరికట్టడానికి పోలీసులు నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. నిమజ్జనం ప్రశాంతంగా, భద్రంగా జరిగేలా చూడాలని ఆయన ఆదేశించారు.

  • ‘అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలి’

    HYD: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 122 అర్జీలు అందగా, వాటిలో 63 ప్రధాన కార్యాలయంలో, 59 జోనల్ స్థాయిలో స్వీకరించారు. టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇంజినీరింగ్, హెల్త్ వంటి విభాగాలకు సంబంధించిన ఈ సమస్యలపై తిరిగి ఫిర్యాదులు రాకుండా చూడాలని కమిషనర్ అధికారులకు సూచించారు.

  • వాకింగ్ చేస్తున్న మహిళ మెడలోని గొలుసు చోరీ.. నలుగురు అరెస్టు

    మేడ్చల్: ఉప్పల్ భగాయత్ పార్క్‌లో వాకింగ్ చేస్తున్న మహిళ మెడలోని గొలుసు లాక్కెళ్లిన నలుగురు చైన్‌స్నాచర్లను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మహేష్, వీరబాబు, వినయ్, హరీష్ అనే నిందితుల వద్ద నుంచి 30 గ్రాముల బంగారు ఆభరణాలను, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలోని ప్రధాన నిందితుడు మహేష్‌పై గతంలో కూడా పీడీ యాక్ట్ నమోదైంది. నిందితులను రిమాండ్‌కు తరలించారు.

  • తాగుబోతుల అడ్డాగా మారిన గండిమైసమ్మ చౌరస్తా..

    మేడ్చల్: దుండిగల్ పీఎస్ పరిధిలోని గండిమైసమ్మ చౌరస్తాలో తాగుబోతుల బెడద తీవ్రంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాజరాజేశ్వరి కాలనీలోని ఉజ్వలబార్ సమీపంలోని ఖాళీస్థలం తాగుబోతులకు అడ్డాగా మారింది. దీంతో అటుగా వెళ్లే మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎక్సైజ్ అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. మరోసారి దుండిగల్ పోలీసులకు సమాచారం అందించారు.

  • ‘వాటే బ్యాటింగ్ సీపీ సార్’

    హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కుల్సుంపుర పీఎస్‌లో సిబ్బందితో కలిసి క్రికెట్ ఆడారు. ఆయన సాధారణ వ్యక్తిలా సరదాగా క్రికెట్ ఆడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. క్రీడలు పోలీసుల మానసిక స్థైర్యాన్ని, ఉత్సాహాన్ని పెంచుతాయని ఈసందర్భంగా సీపీ పేర్కొన్నారు. సీపీ క్రికెట్ ఆడుతున్న వీడియోను చూసిన నెటిజన్లు ఆయనను ప్రశంసించారు. “వాటే బ్యాటింగ్ సీపీ సార్” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు.

     

  • ‘సకాలంలో విగ్రహాలను నిమజ్జనానికి తరలించాలి’

    HYD: గణేశ్ నిమజ్జనాన్ని సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ విజ్ఞప్తి చేశారు. సకాలంలో విగ్రహాలను నిమజ్జనానికి తరలించాలని నిర్వాహకులను కోరారు. ఊరేగింపు మార్గాల్లో ఏర్పాటు చేసిన గార్బేజీ పాయింట్లలోనే చెత్తను వేయాలని భక్తులకు సూచించారు. నిమజ్జన ప్రక్రియ సక్రమంగా సాగేందుకు పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బందికి సహకరించాల్సిందిగా ఆయన ప్రజలను కోరారు.

     

  • గ్రేటర్‌లో అత్యధిక వర్షపాతం నమోదు

    HYD: ఈ వర్షాకాలంలో గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో సాధారణం కంటే 31.3% అధిక వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 1 వరకు సాధారణంగా 407.7 మిల్లీ మీటర్లు నమోదు కావాల్సి ఉండగా, 617.8 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసింది. అత్యధికంగా అమీర్‌పేట్, ఖైరతాబాద్‌లలో 56%, శేరిలింగంపల్లిలో 54% వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ అసాధారణ వర్షాలు నగరంలో అనేక చోట్ల వరదలకు కారణమయ్యాయి.

     

  • HYD సంస్థానంలో ఆ రక్తపుటేరుకు 78 ఏళ్లు

    HYD: సరిగ్గా 78 సంవత్సరాల క్రితం, 1947 సెప్టెంబర్ 2న, నాటి హైదరాబాద్ సంస్థానంలోని పరకాలలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి వెళ్లిన వారిపై రజాకార్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 16 మంది అమరులయ్యారు. చరిత్రలో ఇది మరో జలియన్‌వాలా బాగ్‌ను తలపించింది. స్వాతంత్య్ర పోరాటంలో తెలంగాణ ప్రజలు చూపిన ధైర్యసాహసాలకు ఈ ఘటన ఒక నిదర్శనం.

     

  • పాతబస్తీలో వ్యక్తిపై కత్తితో దాడి

    HYD: పాతబస్తీలోని ఫలక్ నుమా పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. నవాబ్ సాబ్ కుంట వద్ద జరిగిన ఒక చిన్న వివాదం కత్తిపోట్లకు దారితీసింది. గబ్బర్ అనే యువకుడు అనాస్ అనే మరో యువకుడిపై కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. దాడిలో అనాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు గబ్బర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.