మేడ్చల్: బస్టాండ్ ఆవరణలో ఉన్న ఒక వాహనంలోని కుళ్ళిన ఉల్లిగడ్డల వాసనతో ప్రయాణికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు నెలల క్రితం గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకున్న వాహనాన్ని అధికారులు ఇక్కడే నిలిపి ఉంచారు. ఆ వాహనాన్ని ఇక్కడి నుంచి తరలించాలని కోరినా స్పందన లేదని ఆర్టీసీ అధికారులు తెలిపారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Locations: Hyderabad
-
బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా బండ కార్తీకా రెడ్డి
HYD: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితులైన మాజీ మేయర్ బండ కార్తీకా రెడ్డిని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. రవి ప్రసాద్ గౌడ్ సన్మానించారు. తార్నాకలోని ఆమె నివాసంలో శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ, అసెంబ్లీలో కాషాయ జెండా ఎగురవేయడానికి కృషి చేస్తానని కార్తీక్ రెడ్డి తెలిపారు.
-
తూళ్ల వీరేందర్ గౌడ్‌కు సన్మానం
రంగారెడ్డి: బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైన తూళ్ల వీరేందర్ గౌడ్‌ను చేవెళ్లలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. పరిగి నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆయనకు చేవెళ్ల పట్టణ కేంద్రంలో ఘన స్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
-
రాజీకి వీలున్న కేసుల కోసం లోక్ అదాలత్
మేడ్చల్: జినోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో నేటి నుండి 13వ తేదీ వరకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సీఐ గోపగాని గురువయ్య తెలిపారు. చిన్నపాటి తగాదాలు, రాజీకి వీలున్న కేసులలో ఇరు పార్టీలు మేడ్చల్ కోర్టుకు వచ్చి లోక్ అదాలత్‌లో కేసులను పరిష్కరించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు విజ్ఞప్తి చేశారు.
-
పెన్షన్ల కోసం వికలాంగుల ధర్నా
మేడ్చల్: అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతు మహిళలకు వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని ఆందోళనకారులు విమర్శించారు. ప్రభుత్వం స్పందించకపోతే అన్ని రాజకీయ పార్టీలు ఏకమై పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 12న మండల కార్యాలయాల వద్ద కూడా ధర్నా చేస్తామని తెలిపారు.
-
BRS పార్టీ బూత్ స్థాయి కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే సమీక్షా
HYD: ఎర్రగడ్డ డివిజన్ ఇన్‌చార్జ్, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ బూత్ స్థాయి కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, పార్టీ గెలుపుకోసం కృషిచేయాలని పిలుపునిచ్చారు.
-
ఉప్పల్‌లో ఆర్వో వాటర్ టెక్నీషియన్ ఆత్మహత్య
రంగారెడ్డి: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరప్పగడ్డలో దోమ మహేందర్ (30) అనే వ్యక్తి కేబుల్ వైరుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జనగామ జిల్లా కోటిగల్లుకు చెందిన మహేందర్ రాణిగంజ్‌లో ఆర్వో వాటర్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. రెండు సంవత్సరాల క్రితం హనుమకొండకు చెందిన గీతాంజలిని వివాహం చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
కరెంట్ షాక్‌తో కంప్రెషర్ ఆపరేటర్ మృతి
HYD: మియాపూర్‌లోని ప్రశాంత్ నగర్‌లో కంప్రెషర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సూర్యాపేట జిల్లాకు చెందిన ఓర్సు శ్రీను (39) విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. సోమవారం పని చేస్తుండగా బోర్ మోటార్ వైరు ద్వారా షాక్ తగిలింది. తోటి కార్మికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. న్యాయం చేయాలని మృతుడి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు.
-
స్థానిక ఎన్నికలకు సహకరించండి: అదనపు కలెక్టర్
వికారాబాద్: స్థానిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ కోరారు. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలపై చర్చించేందుకు ఆయన కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 594 గ్రామ పంచాయతీలకు 5058 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 6,98,478 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇందులో పురుషులు 3,43,672, మహిళలు 3,54,790, ఇతరులు 16 మంది ఉన్నారని పేర్కొన్నారు. అభ్యంతరాలు ఉంటే తెలియజేయవచ్చని సూచించారు.
-
ట్రాన్స్‌ఫారం మరమ్మత్తుల్లో ఆలస్యం: రైతుల ఆందోళన
వికారాబాద్: తాండూరు పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ముందు యాలాల్ మండలం లక్ష్మీనారాయణపూర్ రైతులు నిరసన చేపట్టారు. పది రోజులక్రితం మరమ్మత్తులకు వచ్చిన ట్రాన్స్‌ఫారంను అధికారులు బాగు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల పంటలకు నీరు అందించలేకపోతున్నామని, పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ సబ్ స్టేషన్ గేటుకు అడ్డంగా ట్రాక్టర్‌ను నిలిపి ఆందోళన చేశారు.