Locations: Hyderabad

  • సీతాఫల్‌మండిలో రూ.1.25 లక్ష

    HYD: సీతాఫల్‌మండిలోని బ్రాహ్మణవాడి కాలనీలో గణేశ్ లడ్డూ రికార్డు ధర పలికింది. శ్రీ సిద్ధి గణనాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ నిర్వహించిన వేలంలో లడ్డూను రూ.1.25 లక్షలకు దాడిగా సామ్రాట్ దక్కించుకున్నారు. టీపీసీసీ సెక్రటరీ దాడిగా సందీప్ రాజ్ తనయుడైన సామ్రాట్ అత్యధిక ధర చెల్లించి ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా సందీప్ రాజ్ మాట్లాడుతూ.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

  • ట్యాంక్‌బండ్‌పై కొనసాగుతున్న విగ్రహాల నిమజ్జనం

    హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్‌లలో గణేశ్ నిమజ్జనం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు సుమారు 90 శాతం విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. మిగిలిన విగ్రహాలను మధ్యాహ్నం వరకు నిమజ్జనం చేసే అవకాశం ఉంది. పీపుల్స్ ప్లాజా మార్గంలో కొన్ని క్రేన్లు మొరాయించడంతో నిమజ్జన ప్రక్రియ ఆలస్యంగా జరుగుతోంది. అయినా కూడా భక్తులు ఆనందోత్సాహాలతో నిమజ్జనంలో పాల్గొంటున్నారు.

     

  • గణేశ్ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగిసింది: మంత్రి పొన్నం

    హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగిసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఉత్సవాలు విజయవంతమయ్యాయని, భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. నిమజ్జన శోభాయాత్రను మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు మేయర్ విజయలక్ష్మి, డీజీపీ జితేందర్ తదితరులు హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. సుమారు రెండు లక్షల విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని తెలిపారు.

  • నంది వాహనం ఎక్కిన ‘శివ’ పుత్రుడు

    HYD: వినాయక నిమజ్జనోత్సవంలో శివుడి వేషధారణతో ఓ భక్తుడు అందరినీ ఆకట్టుకున్నాడు. హిమాయత్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఎడ్లబండిపై గణనాథుడిని ట్యాంక్‌బండ్‌కు తీసుకొచ్చారు. శివుడి వేషధారణలో రథసారథిగా వ్యవహరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘నంది వాహనం ఎక్కి గణపయ్య వస్తున్నాడు’ అంటూ భక్తులు ఆనందంతో పులకించిపోయారు.

  • చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన హైడ్రా సిబ్బంది

    మేడ్చల్: కుత్బుల్లాపూర్‌లోని దుండిగల్ చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన రహీం అనే వ్యక్తిని హైడ్రా సిబ్బంది సమయస్ఫూర్తితో కాపాడారు. కుటుంబ తగాదాల కారణంగా రహీం ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయంతో అతడిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం, కుటుంబ సభ్యుల సమక్షంలో రహీంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని పోలీసులు అతడికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

     

  • పాతబస్తీ మెట్రో.. మరో రెండేళ్లు?

    HYD: దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పాతబస్తీ మెట్రో కల సాకారమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు ఆగిపోయిన పనులను మళ్ళీ ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గతంలో అలైన్‌మెంట్ వివాదాలు, ప్రాజెక్టు వ్యయం పెరగడం వంటి కారణాలతో పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు అడ్డంకులు తొలగిపోతే, రానున్న రెండు సంవత్సరాలలో ఈ ప్రాంతంలో మెట్రో రైళ్లు పరుగులు తీసే అవకాశం ఉంది.

  • గణేశ్ నిమజ్జనం.. డ్రోన్ వీడియోలు

    HYD: వినాయక నిమజ్జనోత్సవాలతో బ్యాంక్‌బండ్ హోరెత్తుతోంది. పాతబస్తీ, చార్మినార్ మీదుగా వేలాది విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌కు చేరుకుంటున్నాయి. ఎటుచూసినా కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కట్టాయి. భారీ ఆకారంలో ఉన్న గణనాథులను చూసి భక్తులు ఆశ్చర్యపోతున్నారు. కొందరు వాహనాలను ప్రత్యేకంగా పూలు, పండ్లతో అలంకరించారు. చార్మినార్, బ్యాంక్‌బండ్ వద్ద డ్రోన్‌తో తీసిన దృశ్యాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.

  • ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం

    రంగారెడ్డి: అప్పరెడ్డిగూడలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. గత ప్రభుత్వం పేదలకు ఇళ్లు కట్టకుండా కమిషన్ల కోసం లక్ష కోట్లు వెచ్చించిందని మంత్రులు విమర్శించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా హామీలను నెరవేర్చుతామని తెలిపారు.

  • సామాన్యుడిలా జనంలోకి.. సీఎం రేవంత్ రెడ్డి

    తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాన్య ప్రజలతో కలిసిపోయేందుకు కొత్త పంథాను అనుసరిస్తున్నారు. సీఎం వస్తున్నారంటే ఉండే హడావుడిని పక్కన పెట్టి, సందర్భాన్ని బట్టి సాధారణ వ్యక్తిలా ప్రజల మధ్యకు వెళ్తున్నారు. ఇటీవల వరదల సమయంలో బల్కంపేట బస్తీని సందర్శించిన ఆయన, నేడు వినాయక నిమజ్జనాల సందర్భంగా ట్యాంక్‌బండ్‌కు వెళ్లి ప్రజలను ఆశ్చర్యపరిచారు. ఈ విధంగా ప్రజలతో మమేకమవడం ఒక కొత్త ఒరవడిగా మారింది.

  • గంగారం చెరువులో క్రేన్ల మొరాయింపు

    రంగారెడ్డి: శేరిలింగంపల్లిలోని గంగారం చెరువు వద్ద వినాయక నిమజ్జనం కోసం సిద్ధం చేసిన క్రేన్లలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో నిమజ్జనం ఆగిపోయింది. GHMC సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిమజ్జనానికి తీసుకువచ్చిన గణనాథుల విగ్రహాలు గాలిలో వేలాడుతూ ఉండటంతో భక్తులు అసంతృప్తి చెందారు.