రంగారెడ్డి : లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. గంజాయి సరఫరా అవుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో తనిఖీలు చేపట్టారు. జనరల్ కోచ్‌లో ఉన్న ఒక సూట్‌కేస్‌లో ఐదులక్షల రూపాయల విలువచేసే 10.24 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు గంజాయిని సీజ్ చేసి కేసునమోదు చేశారు. ఈ గంజాయిని ఎవరు తరలించారనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.
Locations: Hyderabad
-
ఘట్‌కేసర్‌లో గణేష్ నిమజ్జనం పటిష్టమైన ఏర్పాట్ల మధ్య
మేడ్చల్: ఘట్‌కేసర్ మున్సిపల్ పరిధిలోని ఎదులాబాద్ శ్రీలక్ష్మినారాయణ చెరువులో గణనాథుల నిమజ్జనం పటిష్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతోంది. ఇప్పటివరకు 204 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని అధికారులు తెలిపారు. మొదటి రోజు నుంచి మొత్తం 3,000కు పైగా గణనాథుల నిమజ్జనం పూర్తయినట్లు సమాచారం. పోలీసులు, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో బందోబస్తు ఏర్పాటు చేసి నిమజ్జనం ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
-
కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ మండపాల సందర్శన
HYD: ఎమ్మెల్యే శ్రీగణేష్ గణపతి నవరాత్రుల సందర్భంగా నియోజకవర్గంలోని పలు గణనాథుని మండపాలను సందర్శించారు. వార్డు 2లో అర్జున్ నగర్, ఇందిరమ్మనగర్, సిల్వర్ కాంపౌండ్, వార్డు 3లో బాలంరాయి, కార్ఖానా గణేష్ టెంపుల్, సిఖ్ విలేజ్, వార్డు 5లో లక్ష్మీ నగర్, వార్డు 4లో YMCA, బొల్లారం ఆదర్శ్ నగర్, మోండా డివిజన్‌లోని లోహియానగర్‌లలో పూజల్లో పాల్గొన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.
-
అడ్డగుట్టలో గణేష్ లడ్డూ వేలం
HYD: సికింద్రాబాద్ అడ్డగుట్టలోని రెండు పోచమ్మ ఆలయాల వద్ద రాయల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన గణేష్ లడ్డూ వేలంలో ₹68,000 పలికింది. శంకర్ అనే భక్తుడు ఈ లడ్డూను దక్కించుకున్నాడు. నిర్వాహకులు ఎన్. శివ, ఈ. శ్రీనివాస్, రవి, మధు, సుధీర్, సమ్మయ్య తదితరులు శంకర్‌కు లడ్డూను అందజేసి అభినందనలు తెలిపారు.
-
కూకట్‌పల్లి చెరువులో 13,100 విగ్రహాల నిమజ్జనం
HYD: కూకట్‌పల్లిలోని రంగదాముని చెరువులో ఇప్పటివరకు సుమారు 13,100 విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు అధికారులు తెలిపారు. గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఏర్పాట్లు విజయవంతంగా కొనసాగుతున్నాయని, భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.
-
రామంతపూర్‌లో గణపతి లడ్డూ వేలం
మేడ్చల్: రామంతపూర్‌లోని శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద టీం గణపతి యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన గణపతి మండపంలోని చిన్న లడ్డూ రూ. 27,000కు అమ్ముడుపోయింది. బెజ్జం రాజు గుప్తా ఈ లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. భక్తుల మధ్య జరిగిన ఈ వేలంపాటలో లడ్డూకు భారీ ధర పలకడం ఆనందం కలిగించింది.
-
అప్పరెడ్డిగూడలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం
రంగారెడ్డి: నందిగామ మండలం అప్పరెడ్డిగూడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగాపేదలకు ఇళ్ల నిర్మాణం ద్వారా మెరుగైన జీవనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు తెలిపారు.
-
హిందూ మనోభావాలను దెబ్బతీసేలా…
HYD: జగద్గిరిగుట్టలోని శ్రీనివాస్ నగర్‌లో వినాయక నిమజ్జనం ఊరేగింపులో హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన నలుగురు ముస్లిం యువకులతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇద్దరు మైనర్లపై కేసు నమోదు చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు. మరో ఇద్దరు బాలురకు పోలీస్ నోటీసులు జారీ చేశారు.
-
విద్యుత్ షాక్‌తో కేఫ్ ఇన్‌ఛార్జ్ మృతి
రంగారెడ్డి: శంకర్‌పల్లి మండలం మహారాజ్‌పేట్‌కు చెందిన బద్రి శ్రీనివాస్ (45) ఐబీఎస్ యూనివర్సిటీ సమీపంలోని కేఫ్ 3లో విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. ఈ ఘటన సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న కేఫ్ యాజమాన్యం పరారవడంతో, గ్రామస్తులు మృతదేహంతో కేఫ్ ముందు ధర్నా నిర్వహించారు. శ్రీనివాస్‌కు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు.
-
పూర్వ విద్యార్థుల గురు సత్కారం
HYD: దాదాపు 35 ఏళ్ల క్రితం తమకు విద్యాబుద్ధులు నేర్పిన బోయిన్‌పల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల అధ్యాపకులను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. పదవీ విరమణ చేసి వృద్ధాప్యంలో ఉన్న తమ గురువుల ఇళ్లకు వెళ్లి ఈ కార్యక్రమం నిర్వహించారు. పూర్వ విద్యార్థుల అభిమానం చూసి ఆ గురువులు భావోద్వేగానికి లోనై ఆనంద భాష్పాలు రాల్చారు. సందర్భంగా వారు పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.