వికారాబాద్: గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించి, 5610 మంది గ్రామ పరిపాలనాధికారులను నియమించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ట్రెసా వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు జి.విజయేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తుందని, ప్రజలకు, రైతులకు సత్వర సేవలు అందించడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. నూతన వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Locations: Hyderabad
-
వారికి మంచి ఛాన్స్.. సెప్టెంబర్ 20 వరకే అవకాశం
రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 11 మీసేవా సెంటర్ల ఏర్పాటుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 20, 2025 చివరి తేదీగా ప్రకటించారు. ఎంపిక ప్రక్రియ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. అర్హులైన స్థానిక అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం తెలియజేసింది.
-
ప్రశాంతంగా గణనాథుల నిమజ్జనం..
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతోందని డీజీపీ జితేందర్ తెలిపారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేక బలగాలను మోహరించామని పేర్కొన్నారు. ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని, బాలాపూర్ గణపతి శోభాయాత్ర నాలుగు గంటల్లోపు పూర్తవుతుందని వివరించారు. ప్రజలు కూడా నిమజ్జనం త్వరగా పూర్తి చేయాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. బాలాపూర్ గణేశుడు చార్మినార్ వద్దకు చేరుకోవడంతో భారీ రద్దీ నెలకొంది.
-
ప్రియురాలిని నమ్మి.. ప్రాణం తీసుకున్న ల్యాబ్ టెక్నీషియన్
వికారాబాద్: మోమిన్‌పేట్ మండలం కేసారం గ్రామంలో విషాదం నెలకొంది. ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న డప్పు నరేందర్(21) ఆత్మహత్య చేసుకున్నాడు. 3సంవత్సరాల క్రితం తాండూరుకు చెందిన ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకుందామని నమ్మించి, తర్వాత ఆమె దూరం పెట్టడంతో మనస్తాపం చెంది నరేందర్ ఉరి వేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై అరవింద్ తెలిపారు.
-
ట్యాంక్‌బండ్ వద్ద మెడికవర్ హాస్పిటల్స్ అత్యవసర వైద్య సేవలు
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద గణేశ్ నిమజ్జనానికి వచ్చే భక్తులకు మెడికవర్ హాస్పిటల్స్ అత్యవసర వైద్య సేవలను అందిస్తున్నాయి. ఈ సేవలలో నిపుణులైన వైద్యులు, నర్సులు, అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయి. బీపీ, షుగర్ వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. భక్తుల ఆరోగ్య భద్రతే తమ మొదటి ప్రాధాన్యమని మెడికవర్ హాస్పిటల్స్ మార్కెటింగ్ హెడ్ చంద్రశేఖర్ తెలిపారు.
-
ALERT: రాబోయే 2-3 గంటల్లో వర్షం
రాబోయే 2-3 గంటల్లో తెలంగాణలోని భద్రాద్రి, జనగాం, కామారెడ్డి, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే, హైదరాబాద్ నగరంలో రాబోయే గంటలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని అంచనా వేసింది.
-
‘కాంగ్రెస్ పై ప్రేమ ఉంటే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలి’
వికారాబాద్: విద్యా ప్రమాణాలు మెరుగుపరచమని ఉపాధ్యాయులను కోరాల్సింది పోయి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కోరడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే డా. మెతుకు ఆనంద్ విమర్శించారు. కాంగ్రెస్ పై ప్రేమ ఉంటే స్పీకర్ పదవికి రాజీనామా చేసి రాజకీయాలు చేసుకోవాలని హితవు పలికారు. స్పీకర్ పదవిలో ఉండి ఇలా మాట్లాడటం ఆపదవికే మచ్చ తెస్తుందని అన్నారు.
-
క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యం.. రిటైర్డ్ ఉద్యోగి మృతి
రంగారెడ్డి: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట్ న్యూ గాయత్రి నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నడుస్తున్న రిటైర్డ్ ఉద్యోగి ప్రసాద్ బాబు(65)ని క్రేన్ వాహనం ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
-
TG నిరుద్యోగులకు అలర్ట్.. 118 పోస్టులకు నోటిఫికేషన్!
తెలంగాణలో ఖాళీగా ఉన్న 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(TSLPRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు LLB/BL డిగ్రీతో పాటు క్రిమినల్ కోర్టుల్లో మూడు సంవత్సరాల అనుభవం ఉన్నవారు అర్హులు. 34 సంవత్సరాలకు మించకూడదు. అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 5, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
-
చార్మినార్ వద్దకు బాలాపూర్ గణనాథుడు
HYD: బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర పాతబస్తీలో అత్యంత వైభవంగా కొనసాగుతోంది. లడ్డూ వేలం అనంతరం ప్రారంభమైన ఈ యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటున్నారు. డప్పు చప్పుళ్లు, యువత కేరింతల మధ్య సాగుతున్న ఊరేగింపు తాజాగా చారిత్రక చార్మినార్‌కు చేరుకుంది. యాత్ర హుస్సేన్ సాగర్ వైపుగా కొనసాగుతుండగా, సాయంత్రం 4 గంటల కల్లా నిమజ్జనం పూర్తి కావొచ్చని అంచనా. భద్రతా బలగాలు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నాయి.(వీడియో)