Locations: Hyderabad

  • మేడ్చల్- అత్వెల్లి రోడ్డుపై వాహనం బ్రేక్ డౌన్..

    మేడ్చల్ బస్టాప్ సమీపంలోని 7 టెంపుల్ వద్ద రోడ్డుకు అడ్డంగా ఒక లారీ ఆగిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మేడ్చల్ నుంచి అల్వెల్లి, తూప్రాన్ వైపు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, లారీని తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మార్గంలో ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.

     

  • బాహుబలి క్రేన్‌ వద్దకు ఖైరతాబాద్‌ బడాగణేశ్‌.. కాసేపట్లో నిమజ్జనం

    HYD: ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ శోభాయాత్ర ఘనంగా సాగింది. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని బాహుబలి క్రేన్‌ పాయింట్‌ 4 వద్దకు వినాయకుడు చేరుకున్నాడు. నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అన్‌వెల్డింగ్‌ పనులు జరుగుతున్నాయి. మరికాసేపట్లో నిమజ్జన ప్రక్రియ ప్రారంభం కానుంది. బడా గణేశుడిని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మరోవైపు ఎన్టీఆర్‌ మార్గ్‌లో భారీ బందోబస్తు చేపట్టారు.

  • బాలాపూర్ గణేశ్ లడ్డూ డబ్బులను ఏం చేస్తారంటే?

    HYD: బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బులను గ్రామాభివృద్ధి కోసం వినియోగిస్తున్నారు. 1994లో ప్రారంభమైన ఈ వేలం ద్వారా ఇప్పటివరకు రూ. కోటికి పైగా నిధులు సమకూరాయి. ఈ నిధులతో గ్రామంలో పాఠశాలలు, రోడ్లు, ఆలయాల నిర్మాణం వంటివి చేపట్టారు. ఫలితంగా గ్రామం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.

     

  • ఫీల్డ్ లోకి మహిళా అశ్విక దళం.. గుర్రాలపై లేడీ కానిస్టేబుళ్ల పెట్రోలింగ్

    హైదరాబాద్ పోలీస్ విభాగంలో నూతనంగా మహిళా అశ్విక దళాన్ని ఏర్పాటుచేసినట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. 10మంది మహిళా కానిస్టేబుళ్లకు గోషామహల్ మౌంటెడ్ యూనిట్‌లో రెండు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే విధుల్లో చేరిన ఈ బృందం ఇకపై బందోబస్తు, పెట్రోలింగ్, వీఐపీ భద్రత వంటి విధులు నిర్వహిస్తుందని చెప్పారు. దేశంలోనే ఇలాంటి దళం అరుదుగా ఉందని సీపీ పేర్కొన్నారు.

  • క్రేన్ నం.4 వద్ద ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం

    HYD: ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ శోభాయాత్ర భారీ భద్రత నడుమ వైభవంగా సాగుతోంది. ఈ ఊరేగింపును చూసేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో నగరంలో సందడి వాతావరణం నెలకొంది. ట్యాంక్‌బండ్‌పై ఉన్న క్రేన్‌ నం.4 వద్ద బడాగణేశ్‌ను నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ కారణంగా నిమజ్జన ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.

     

  • బాలాపూర్ గణేశ్ లడ్డూ చరిత్రపై ఓ లుక్కేయండి!

    HYD: బంగారు లడ్డూగా ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం ప్రతి ఏటా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 1994లో రూ.450తో ప్రారంభమైన ఈ వేలం, 2010లో రూ.5.35 లక్షలు, 2017లో రూ.15.6 లక్షలు పలికింది. 2023లో రూ.27 లక్షలు, 2024లో రూ.30 లక్షలు దాటింది. తాజాగా 2025లో ఈధర రూ.35 లక్షలు పలికింది. ఈ లడ్డూ వేలం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది.

  • ట్యాంక్ బండ్ వద్ద జనసంద్రం

    HYD: హుస్సేన్ సాగర్ ట్యాంక్‌బండ్‌ వద్ద గణేశ్ నిమజ్జనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నగరం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ఈ వేడుకను చూసేందుకు తరలివస్తున్నారు. దీంతో సచివాలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

     

     

  • బాలాపూర్ లడ్డూ.. లైవ్‌లోనే డబ్బులు చెల్లించిన దశరథ్ గౌడ్

    HYD: బాలాపూర్ గణనాథుడి లడ్డూ వేలంపాట మరోసారి కొత్త రికార్డు సృష్టించింది. లింగాల దశరథ్ గౌడ్ ఈ లడ్డూను రూ.35 లక్షలకు దక్కించుకున్నారు. వేలంలో మొత్తం 38 మంది పాల్గొనగా, గట్టి పోటీ మధ్య దశరథ్ గౌడ్ అత్యధిక ధర వెచ్చించారు. ఈసారి దశరథ్ గౌడ్ లైవ్‌లోనే డబ్బులు చెల్లించడం విశేషం.

  • మధ్యాహ్నం 2 గంటలకు నిమజ్జనం పూర్తయ్యే అవకాశం

    HYD: ఖైరతాబాద్ బడా గణేశ్‌ నిమజ్జన శోభాయాత్ర వైభవంగా సాగుతోంది. లక్షలాది మంది భక్తుల మధ్య మహాగణపతి ఊరేగింపు అట్టహాసంగా కొనసాగుతోంది. రాజ్‌ధూత్‌ హోటల్, టెలిఫోన్ భవన్‌, సచివాలయం మీదుగా ఈ యాత్ర ట్యాంక్ బండ్‌కు చేరుకుంటుంది. మధ్యాహ్నం 2 గంటల కల్లా నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ వేడుకలో పాల్గొనడానికి ట్యాంక్‌బండ్‌ రోడ్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

  • రేపు రాత్రి 11 గంటల వరకు వాటికి నో ఎంట్రీ!

    హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. రేపు రాత్రి 11 గంటల వరకు నగరంలోకి లారీలకు అనుమతి లేదు. మెహిదీపట్నం, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్‌ వరకు ఆర్టీసీ బస్సులను అనుమతిస్తారు. ఇతర రాష్ట్రాల, జిల్లాల బస్సులు చాదర్‌ఘాట్ వరకు మాత్రమే రాగలవు. భక్తుల సౌకర్యార్థం మెట్రో రైలు సర్వీసులను రాత్రి ఒంటి గంట వరకు పొడిగించారు.