Locations: Hyderabad

  • ఆలయ చోరీల ముఠా అరెస్టు

    రంగారెడ్డి: ఆలయ చోరీలకు పాల్పడిన ముఠాను ఎల్బీనగర్‌ సీసీఎస్, ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలుకు చెందిన కే.శివానంద (52), ప్రకాశం జిల్లాకు చెందిన ఎస్‌కే.షరీఫ్‌ (38) నైవేద్యం పెడుతున్నట్లు నటిస్తూ.. ఆలయ విగ్రహాలు, గంటలు దొంగిలించారు. వారి నుంచి రూ.5.36 లక్షల విలువైన 12 పంచలోహ, వెండి విగ్రహాలు, గుడి గంటలు, హుండీలు స్వాధీనం. యాచారం, ఇబ్రహీంపట్నంలోని ఆలయాల్లో చోరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

  • వాట్సప్‌లోనూ ఆస్తిపన్ను కట్టొచ్చు

    HYD: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పౌర సేవలను సులభతరం చేయడానికి వాట్సప్‌ ద్వారా ఆస్తిపన్ను, ట్రేడ్‌ లైసెన్సు ఫీజు చెల్లింపు సౌకర్యాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ సేవలను అమలు చేసేందుకు ఆసక్తి గల సంస్థల నుంచి ప్రతిపాదనలు కోరుతూ జీహెచ్‌ఎంసీ ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ (ఈఓఐ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈనిర్ణయం ప్రజలకు సేవలను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ఉంది.

  • డేటింగ్‌ యాప్‌లో యువతి మోసం

    HYD: నగరానికి చెందిన 28 ఏళ్ల యువకుడిని ‘ఛాట్‌ జోజో’ డేటింగ్‌ యాప్‌ ద్వారా మడుగుల శరణ్య రూ.1.9 లక్షలు మోసం చేసింది. అనాథనని, ఆకలితో ఉన్నానని భావోద్వేగ కథనంతో నమ్మించి, రూ.95 వేలు బదిలీ చేయించింది. తర్వాత సుభాష్‌ అనే వ్యక్తితో ఆత్మహత్యాయత్నం నాటకంఆడి మరో రూ.95వేలు కాజేసింది. డబ్బులు బెట్టింగ్‌లో పోయాయని, ఫోన్లు స్విచ్‌ఆఫ్‌ చేసింది.బాధితుడు సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

  • బోనాల జాతర.. ఊర మాస్ బ్యాండ్

    HYD: బల్కంపేట రథోత్సవంలో ఫలహారం బండ్లు, ఘటాల ఊరేగింపుతో ప్రాంగణం మారుమోగింది. పోతరాజుల విన్యాసాలు, కళాకారుల నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. జాల్నా బ్యాండ్, షేర్ బ్యాండ్‌తో ఓ వ్యక్తి రంగుల రాట్నంలా ప్రదర్శన ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. కిలోమీటర్ మేర కొనసాగిన జులూస్‌కు వేలాది మంది భక్తులు తరలివచ్చారు, ఉత్సవ వాతావరణం సందడిగా మారింది.

     

  • దశలవారీగా రాజీవ్‌ స్వగృహ ఆస్తుల వేలం

    HYD : రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న అపార్ట్‌మెంట్లు, ఓపెన్‌ ప్లాట్లు, ఫ్లాట్లను దశలవారీగా వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వేలం వేయనున్న ఆస్తుల వివరాలపై రెండు, మూడు రోజుల్లో ప్రకటనను విడుదల చేయనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. వేలం ప్రక్రియను నాలుగు దశల్లో పూర్తి చేయాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం.

  • రోడ్డు ప్రమాదంలో ఫిల్మ్ నగర్ ఎస్సై మృతి

    HYD: సంగారెడ్డి జిల్లా చేరియాల్ గుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫిల్మ్ నగర్ ఎస్సై రాజేశ్వర్ గౌడ్ మృతి చెందారు. రాజేశ్వర్ గౌడ్ హైదరాబాద్ ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్టు

    HYD: రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు హెరాయిన్ సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.1.10 కోట్ల విలువైన 650 గ్రాముల హెరాయిన్, 84 గ్రాముల పాపిస్ట్రాను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రాజారాం హెరాయిన్‌ను నెక్నాంపూర్‌లో చోగరాం విష్ణోయ్‌కి అప్పగించగా.. ఎస్‌వోటీ పోలీసులు విష్ణోయ్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • 6న హైదరాబాద్‌కు జస్టిస్‌ పీసీ ఘోష్‌

    HYD : కాళేశ్వరంపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఈ నెల 6న హైదరాబాద్‌కు రానున్నారు. కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించి మంత్రివర్గ నిర్ణయాలతోపాటు అదనంగా ఏమైనా సమాచారం ఉంటే అందజేయాలని గతనెలలో కమిషన్‌ నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శికి, సీఎంవోకు సూచించింది. 6వ తేదీ నుంచి మూడు రోజులపాటు పీసీ ఘోష్‌ ఉంటారని, నెలాఖరులో మళ్లీ వచ్చి తుది నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

     

  • 6 నెలల్లో 1.12 లక్షల కేసులు

    HYD: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. 2025 మొదటి ఆరు నెలల్లో 1.12 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. వర్షాకాలంతో డయేరియా, న్యుమోనియా కేసులు పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. కలుషిత నీరు, ఆహారం, దోమల సమస్య తీవ్రతరం చేస్తోంది. జీహెచ్‌ఎంసీ,వైద్య ఆరోగ్యశాఖల మధ్య సమన్వయ లోపంతో ప్రభుత్వాస్పత్రుల్లో సకాలంలో వైద్య సేవలు అందటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • 20 మంది పేకాట రాయలు అరెస్టు

    మేడ్చల్: షామీర్‌పేట్ పీఎస్ పరిధిలోని బొమ్మరాసిపేట్ గ్రామంలో ఏ అండ్ ఏ స్కై రిసార్ట్‌లో పేకాట ఆడుతూ.. మద్యం సేవిస్తున్న 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సమాచారం అందిన వెంటనే ఎస్‌పీ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి, 1.83 లక్షల రూపాయల నగదు, 9 కార్లు, 20 సెల్‌ఫోన్లు, 10 సెట్ల పేకాట కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శ్రీనాథ్ తెలిపారు.