Locations: Hyderabad

  • సులోచన దశదిన కర్మ.. నాయకుల నివాళి

    మేడ్చల్: మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, 18వ వార్డు మాజీ కౌన్సిలర్ తల్లి పాలకుర్తి సులోచన ఇటీవల మరణించారు. అత్వెల్లిలో జరిగిన దశదిన కర్మలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, నక్క ప్రభాకర్ గౌడ్ నివాళులర్పించారు. సులోచన మంచితనానికి మారుపేరని, ఆమె మృతి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబానికి సానుభూతి తెలిపారు.

  • విద్యుత్ షాక్‌తో నెమలికి గాయం

    HYD: మెహదీపట్నం పీఎస్ పరిధిలోని ఫస్ట్ లాన్సర్ ప్రాంతంలో విద్యుత్ షాక్‌తో నెమలి గాయపడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు సంఘటనా స్థలానికి చేరుకుని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు తెలిపారు. ఫారెస్ట్ అధికారులు గాయపడిన నెమలిని తీసుకొని చికిత్స కోసం జూ పార్క్ అధికారులకు అప్పగించారు.

  • శిథిల భవనాల కూల్చివేత..

    HYD: గ్రేటర్‌ హైదరాబాద్‌లో వర్షాకాలం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ విభాగం 536 శిథిల భవనాలకు నోటీసులు జారీ చేసింది. 125 భవనాలను ఖాళీ చేయించగా, 34 భవనాలను కూల్చివేశారు, 41 చోట్ల మరమ్మతులు జరిగగా.. ఒక భవనం సీజ్‌ చేశారు. చార్మినార్‌, సికింద్రాబాద్‌, గోషామహల్‌ సర్కిళ్లలో మిగిలిన కట్టడాలపై 10 రోజుల్లో డ్రైవ్‌ పూర్తి చేయనున్నారు. ప్రాణనష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

     

  • UGC డిఫాల్టర్‌ జాబితాలో IIT హైదరాబాద్‌

    ర్యాగింగ్‌ను అరికట్టేందుకు నిబంధనలు పాటించని 4 IITలు, 3 IIMలను UGC డిఫాల్టర్‌ జాబితాలో చేర్చారు. అధికారిక వర్గాల సమాచారం మేరకు.. ఈ జాబితాలో ఐఐటీ హైదరాబాద్‌, ఐఐటీ బాంబే, ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఐఐటీ పలక్కాడ్‌, ఐఐఎం బాంబే, ఐఐఎం రోహ్‌టక్‌, ఐఐఎం తిరుచిరాపల్లి ఉన్నాయి. డిఫాల్టర్‌ జాబితాలో ముఖ్యమైన 17 జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఉన్నాయి.

  • గోల్కొండ కోటలో బోనాల సందడి.. రద్దీతో స్వల్ప తొక్కిసలాట

    HYD: గోల్కొండ కోట బోనాల ఉత్సవాలతో సందడిగా మారింది. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో ఉర్రూతలూగింది. అమ్మవారికి బోనం సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి, అక్కడే వంటలు చేసి ఆరగించారు. భక్తుల రద్దీ కారణంగా స్వల్ప తొక్కిసలాట జరిగి, పలువురు కిందపడ్డారు.

  • పెట్టుబడికి వడ్డీ ఇస్తామని రూ.2.7 కోట్ల మోసం

    HYD: బాచుపల్లికి చెందిన విశ్రాంత బ్యాంకు ఉద్యోగి భార్యను వసుధ, ఆమె కూతురు ఉజ్వల మోసం చేశారు. 2% నెలవారీ వడ్డీ హామీతో రూ.55లక్షలు, మరో ఐదుగురి నుంచి రూ.2.07 కోట్లు వసూలు చేశారు. 2024 నవంబరు నుంచి వడ్డీ చెల్లింపు ఆపేసి, 2025 ఫిబ్రవరిలో తిరిగిస్తామని భూమి, ఇంటిని రిజిస్టర్ చేస్తామని మళ్లీ మోసం చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో సైబరాబాద్ ఈవోడబ్ల్యూ కేసు నమోదు చేసింది.

  • విద్యుత్తు అంతరాయాలకు అడ్డుకట్ట

    HYD: దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌) రింగ్‌ మెయిన్‌ యూనిట్ల (ఆర్‌ఎంయూ) నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించనుంది. నగరంలో 25% ఆర్‌ఎంయూలు పనిచేయకపోవడంతో, సిబ్బంది నిర్వహణలో లోపాలు తలెత్తాయని తనిఖీల్లో వెల్లడైంది. హైదరాబాద్‌ సౌత్‌ సర్కిల్‌లోని 8 సబ్‌డివిజన్లలో 348 3వే, 5వే ఆర్‌ఎంయూల వార్షిక నిర్వహణ కాంట్రాక్ట్‌ కోసం టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

  • ప్లాస్టిక్ బియ్యం కాదు.. ఫోర్టిఫైడ్ రైస్

    HYD: రేషన్ బియ్యంలో తెల్లగా నీటిలో తేలే బియ్యాన్ని కొందరు ప్లాస్టిక్ బియ్యంగా భ్రమిస్తున్నారు. కానీ వాస్తవానికి అవి ఐరన్, ఫోలిక్ యాసిడ్, B12 విటమిన్లతో కూడిన ఫోర్టిఫైడ్ రైస్ అని హైదరాబాద్ పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహశీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. బియ్యం కడిగేటప్పుడు వాటిని తొలగించకుండా తింటే శరీరానికి బలం, ఆరోగ్యం లభిస్తాయని సూచించారు.

  • గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

    HYD: నాగర్‌కర్నూల్‌కు చెందిన పాడియా సురేష్‌(24), బోడుప్పల్‌ నివాసి, కూకట్‌పల్లిలో మిత్రుడితో షాపింగ్‌కు వెళ్లాడు. రాత్రి 10 గంటలకు తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి మిత్రుడి గదిలో పడుకుంటానని, ఉదయాన్నే వస్తానని తెలిపాడు. ఉదయం కూకట్‌పల్లి మెట్రో పిల్లర్‌ 839 వద్ద గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో సురేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

  • బనకచర్లపై రేపు ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్‌ ప్రజంటేషన్‌

    HYD : AP చేపట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. CM రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరుకానున్నారు. మంత్రులు, MPలు, MLAలు, MLCలు, కార్పొరేషన్‌ ఛైర్మన్లు, వివిధ కమిషన్ల ఛైర్మన్లు, సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.