TG: హైదరాబాద్‌లోని మహా న్యూస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. ఇది హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సమర్థనీయం కాదని ట్వీట్ చేశారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ దాడిని ఖండించడమే కాకుండా.. మహా న్యూస్ కార్యాలయాన్ని పరిశీలించారు.
Locations: Hyderabad
-
టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి
మేడ్చల్: శామీర్‌పేట్ పీఎస్ పరిధిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచాల కుమార్ (39) మృతి చెందాడు. తూంకుంట మున్సిపల్ అంతాయిపల్లికి చెందిన కుమార్ రోడ్డు దాటుతుండగా.. అతివేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. శామీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
-
ఓఎల్ఎక్స్ ముసుగులో సైబర్ నేరాలు..
HYD: నగరంలోని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు ఓఎల్ఎక్స్‌లో ఎంబ్రాయిడరీ కుట్టు మిషన్ విక్రయిస్తామని మోసాలకు పాల్పడిన పేకేటి వీరాబాబును శనివారం అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీరాబాబు, ఎస్ఆర్‌నగర్‌లో నివసిస్తూ.. ఓఎల్ఎక్స్‌లో రూ.2.3 లక్షలకు మిషన్ విక్రయిస్తామని ప్రకటన ఇచ్చి ఓప్రైవేటు ఉద్యోగిని మోసం చేశాడు. అమాయకులను మోసంచేసి కొట్టేస్తున్న డబ్బును గేమింగ్ ఖాతాలకు, కమీషన్‌ల మీద మళ్ళిస్తుంటాడని పోలీసులు గుర్తించారు.
-
తెలంగాణలో 44 మంది డీఎస్పీల బదిలీ
HYD: తెలంగాణలో 44 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ బదిలీల్లో వై.నాగేశ్వరరావు (ఏసీపీ సీసీఎస్ సైబరాబాద్), ఆకుల చంద్రశేఖర్ (ట్రాఫిక్ ఏసీపీ మహేశ్వరం), సంపత్ కుమార్ (ఏసీపీ కమాండ్ కంట్రోల్ రాచకొండ) ఉన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో కీలక పోస్టింగ్‌లు ఈ బదిలీల్లో భాగమని తెలిపారు.
-
రాంకీ సిబ్బంది నిర్లక్ష్యంతో వృద్ధురాలు మృతి
HYD: బాగ్ లింగంపల్లికి చెందిన రేఖ(60) నారాయణగూడ గాంధీకుటీర్ బస్తీ సమీపంలోని జీహెచ్‌ఎంసీ చెత్తకుండి వద్ద నిద్రించింది. తెల్లవారుజామున రాంకీ సంస్థ సిబ్బంది వృద్ధురాలిని గమనించకుండా చెత్తను తొలగించే క్రమంలో జేసీబీ ఆమె తలకు తాకి అక్కడిక్కడే మృతిచెందింది. సిబ్బంది అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
-
ఆషాఢం బోనాల జాతర శాంతి సమావేశం
మేడ్చల్: ఆషాఢం బోనాల జాతర కోసం ఆలయ కమిటీలు భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని బాలానగర్ పోలీసులు సూచించారు. తొట్టెల, ఫలహారం బండ్ల ఊరేగింపులలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలపై సీఐ నర్సింహా రాజు ఆధ్వర్యంలో శనివారం ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులతో శాంతి సమావేశం నిర్వహించారు. ఏసీపీ పి. నరేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
-
హైదరాబాద్‌లో భూముల ధరలు.. ఆకాశం వైపు..
HYD: నగరంలో భూముల ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన వేలంలో చదరపు గజం రూ.2.98 లక్షలకు అమ్ముడైంది. ఐటీ హబ్ సామీప్యం, మౌలిక సదుపాయాల విస్తరణ, మెట్రో, ఎక్స్‌ప్రెస్‌వేలతో డిమాండ్ పెరిగింది. అపార్ట్‌మెంట్ల ధరలు రూ.1.2-1.5 కోట్ల మధ్య ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీలు, శివారు ప్రాంతాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి.
-
పాన్ షాప్ యజమాని ఆత్మహత్య
మేడ్చల్: పశ్చిమ బెంగాల్‌కు చెందిన అప్సర్(40), శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముడిచింతలపల్లిలో అద్దె ఇంటిలో నివసిస్తూ పాన్ షాప్ నడిపేవాడు. శనివారం ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య కారణాలు తెలియరాలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
-
వివాహిత అనుమానాస్పద మృతి
మేడ్చల్: 30 ఏళ్ల భార్గవి, ప్రైవేట్ ఉద్యోగి, 2024 నవంబర్‌లో భరత్ కుమార్‌తో ప్రేమ వివాహం చేసుకుని వెస్ట్ కృష్ణ నగర్‌లో నివసించింది. అప్పుల విషయంపై దంపతుల మధ్య గొడవ జరిగింది. భరత్ బయట పడుకోగా.. భార్గవి ఇంట్లో ఉంది. ఉదయం 7గంటలకు భరత్, హరీష్‌తో డోర్ తెరిచి చూడగా, భార్గవి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
జొప్లా ఇండస్ట్రీస్‌ను సందర్శించిన ఎమ్మెల్యే
మేడ్చల్: మల్లాపూర్‌లోని జొప్లా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు, కార్మిక యూనియన్ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ సందర్శించి, ఎంప్లాయిస్ యూనియన్ సమస్యలపై కంపెనీ ఎండీ శ్రీనివాస్‌తో చర్చించారు. INTUC జెండాను ఆవిష్కరించిన ఆయన, కార్మికుల అగ్రిమెంట్, ఇంక్రిమెంట్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.