
Locations: Hyderabad
-
హెల్త్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి
HYD: చింతల్ బస్తి అర్బన్ హెల్త్ సెంటర్‌ను హైదరాబాద్ ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అనంతరం డాక్టర్స్ ,సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తుందని రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రులు , పాఠశాలలు ,హాస్టల్‌లలో తనిఖీలు , శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. -
ఇసుక లారీ ఢీకొని.. యువకుడు దుర్మరణం
మేడ్చల్: కుత్బుల్లాపూర్ మండలం సూరారం పీఎస్ పరిధిలో సాయిబాబా నగర్ కూడలి వద్ద ఇసుక లారీ ఢీకొనడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇస్లావత్ సాయికుమార్ (22) అక్కడికక్కడే మృతిచెందాడు. నర్సాపూర్ మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన సాయికుమార్, చర్చిగాగిల్లాపూర్‌లో నివసిస్తూ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. అక్క సంగీత ఇంటికి వెళ్తుండగా.. అదుపుతప్పిన లారీ వెనక చక్రం కిందపడి ప్రాణాలు కోల్పోయాడు.పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
-
ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్నది వారే: గోనె ప్రకాష్‌రావు
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా తన వాగ్మూలాన్ని సిట్ అధికారులకు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్‌రావు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘కేటీఆర్, సంతోష్ కుమార్, కవిత కలిసి ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఇదంతా కేసీఆర్‌కు తెలిసే జరిగింది. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ రిపోర్ట్.. కేసీఆర్, సంతోష్ రావులకు ఇచ్చారు’’ అని పేర్కొన్నారు.
-
చెరువుల కబ్జాపై కోలన్ హనుమంత్ రెడ్డి ఆగ్రహం
మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 30 చెరువులను స్థానిక ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేశారని కాంగ్రెస్ ఇంఛార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి ఆరోపించారు. సూరారంలో బోరు బావులు ఎండిపోవడంతో నీటి కొరత ఏర్పడిందని స్థానికులు ఆయనకు విన్నవించారు. సర్వే నెంబర్ 21లోని కొత్త కుంట చెరువును బీఆర్‌ఎస్ నాయకులు మట్టి పోసి కబ్జా చేస్తున్నారని, ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని, చెరువులను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.
-
బోనాల పండుగకు సిద్ధమవుతున్న భాగ్యనగరం
HYD: ఆషాడ మాసం రాగానే నగరంలో బోనాల ఉత్సవాలు సందడి చేస్తాయి. నెల రోజుల పాటు పోతురాజుల విన్యాసాలు, అలంకరించిన బోనాలు, తొట్టెల ఊరేగింపు, డప్పు చప్పుళ్లతో ఆధ్యాత్మిక శోభ విరజిల్లుతుంది. ఈ నెల 26న గోల్కొండలో తొలి బోనం సమర్పణతో వేడుకలు ప్రారంభమవుతాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్షించి, భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఆదేశించారు.
-
టోలిచౌకీలో పోలీసుల కార్డెన్‌సెర్చ్..
HYD: టోలిచౌకి పీఎస్ పరిధిలోని పారమాంట్ కాలనీలో శుక్రవారం ఉదయం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పారామౌంట్ కాలనిలో ప్రతి ఒక్క ఇంటిని, వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనాలు, మద్యం, హుక్కాపాట్లను సీజ్ చేశారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలను పాటించాలని, శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా సహకరించాలని కోరారు.
-
‘బోధనలో ప్రమాణాలు మెరుగవ్వాలి’
మేడ్చల్: విద్యా బోధనలో ప్రమాణాలు మెరుగుపరచాలని ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కిషన్ అన్నారు. కూకట్‌పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన సందర్శించారు. ఇంటర్ మొదటి ఏడాదిలో రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు సాధించిన జ్యోతిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వెంకటయ్య పాల్గొన్నారు.
-
‘హెల్మెట్ వల్లే నేను బ్రతికి ఉన్నాను’
HYD: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో నటుడు సాయి దుర్గా తేజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘హెల్మెట్’ వల్లే నేను బతికి ఉన్నానని, అందరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. యోగా భారతదేశం ఇచ్చిన గొప్ప వరమని మానసిక ఒత్తిడి తగ్గించేందుకు ప్రతీరోజు కొంత సమయం కేటాయించి యోగా చేయాలి అని పేర్కొన్నారు.
-
పైప్‌లైన్ నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
HYD: మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ గురుద్వారా వెనుక రాష్ట్రప్రభుత్వ రూ.11లక్షల నిధులతో సివరేజ్ పైప్‌లైన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రారంభించారు. గత 8ఏళ్లుగా సివరేజ్ సదుపాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీవాసుల సమస్య ఈ పనులతో తీరనుంది. వర్షాకాల నేపథ్యంలో పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు.
-
మిలిటరీ కాలేజీలో చొరబాటు.. యువకుల అరెస్టు
HYD: సికింద్రాబాద్‌లోని మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజీలో నకిలీ ఆర్మీ గుర్తింపు కార్డులతో యువకులు చొరబడి కాలేజీ ప్రాంగణంలో వీడియోలు, ఫోటోలు తీశారు. మిలిటరీ క్యాంటీన్ వద్ద ఆర్మీ సిబ్బంది ప్రశ్నించగా.. గుర్తింపు కార్డులు నకిలీవని తేలాయి. దీంతో తిరుమలగిరి పోలీసులకు యువకులను అధికారులు అప్పగించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.