
Locations: Hyderabad
-
యువకుడి దారుణ హత్య
రంగారెడ్డి: చందానగర్ పీఎస్ పరిధిలోని గిడ్డంగి కల్లు కంపౌండ్‌లో యువకుడు అమ్రేష్ దారుణ హత్యకు గురయ్యాడు. శామీర్‌పేట్‌లోని పెట్రోల్ బంక్‌లో పనిచేసే అమ్రేష్, ముగ్గురు స్నేహితులతో కల్లు తాగడానికి వచ్చాడు. మహిళ విషయంలో వారి మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో స్నేహితులు అమ్రేష్‌ను కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మలక్‌పేట్‌లో భారీగా ట్రాఫిక్ జామ్
HYD: మలక్‌పేట్ మెయిన్ రోడ్డుపై పీక్ అవర్స్‌లో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. న్యూ మార్కెట్ రోడ్, యశోదా హాస్పిటల్, నల్గొండ X రోడ్స్, RUB నుంచి చాదర్‌ఘాట్ రోటరీ వైపు ట్రాఫిక్ రద్దీ నెలకొంది. మలక్‌పేట్ ట్రాఫిక్ పోలీసులు నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. ప్రయాణికులు రద్దీని నివారించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
-
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
మేడ్చల్: దుందిగల్ మున్సిపాలిటీ శంభీపూర్‌లోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మంజూరు చేయించిన రూ.2,99,500విలువైన 8 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బీఆర్‌ఎస్ నేత శంభీపూర్ కృష్ణ లబ్ధిదారులకు అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి, చికిత్స పొందినవారికి ఈ నిధి ఉపయోగపడుతుందని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కృష్ణ తెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు నవీన్ తదితరులు పాల్గొన్నారు.
-
GSECను ప్రారంభించిన సీఎం రేవంత్
TG: ప్రముఖ ఐటీ దిగ్గజం గూగుల్ ఏర్పాటు చేసిన ‘గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC)’ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. హైటెక్ సిటీ రోడ్డులోని గూగుల్ దివ్యశ్రీ భవన్‌లో దీనిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, గూగుల్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా GSEC పనితీరును సీఎం రేవంత్‌కు గూగుల్ ప్రతినిధులు వివరించారు.
-
బేగంపేట్ ఎయిర్‌పోర్టులో బాంబు.. ఫేక్ మెయిల్
HYD: సికింద్రాబాద్‌లోని బేగంపేట్ ఎయిర్‌పోర్టులో బాంబు ఉన్నట్లు వచ్చిన మెయిల్ ఫేక్ అని పోలీసులు తేల్చారు. ఎయిర్‌పోర్టులో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేయగా.. ఎలాంటి పేలుడు పదార్థాలు బయటపడలేదు. దీంతో బాంబు ఉందంటూ వచ్చిన మెయిల్‌లో నిజం లేదని తెలిపారు. ఆ మెయిల్ వచ్చిన అకౌంట్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించామని పేర్కొన్నారు.
-
జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ ఏసీపీ సుమన కన్నుమూత
HYD: జీహెచ్‌ఎంసీ సర్కిల్ 13(కార్వాన్) టౌన్ ప్లానింగ్ ఏసీపీ మంత్రి సుమన(51) క్యాన్సర్ వ్యాధితో యూసుఫ్‌గూడలోని ఇంట్లో ఆకస్మికంగా మృతిచెందారు. ఆరునెలల క్రితం ఏసీపీగా నియమితులైన సుమన, సోమవారం క్యాన్సర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆమెమృతితో పవన్ కళ్యాణ్ కాలనీలో విషాదం నెలకొంది. సుమన మృతి పట్ల కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్, డిప్యూటీ కమిషనర్ శశిరేఖ సంతాపం వ్యక్తం చేశారు.
-
బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు
HYD: సికింద్రాబాద్‌లోని బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఎయిర్‌పోర్టులో బాంబు ఉందంటూ పోలీసులకు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేపట్టారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
-
అక్షరాభ్యాసం చేయించిన కార్పొరేటర్
మేడ్చల్: జగద్గిరిగుట్ట డివిజన్‌లోని రింగుబస్తీ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన బడిబాట అక్షర అభ్యాస కార్యక్రమంలో కార్పొరేటర్ కొలుకుల జగన్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించాలని, మౌలిక వసతుల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు కమల, ఉపాధ్యాయులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
-
దారుణం.. తండ్రిని హతమార్చిన కుమారుడు
రంగారెడ్డి: తండ్రిని కొడుకు కిరాతంగా రాయితో కొట్టి చంపిన ఘనట కందుకూరు పీఎస్ పరిధి పులుమామిడిలో జరిగింది. తండ్రి జంగయ్యకు ఉన్న అరెకరాపొలాన్ని అమ్మేద్దామని కొంతకాలంగా కొడుకు శేఖర్ అడిగేవాడు. పొలం అమ్మేందుకు తండ్రి అంగీకరించకపోవడంతో కోపోద్రిక్తుడైన కుమారుడు నిద్రిస్తున్న జంగయ్య తలపై బండరాయితో బలంగా కొట్టడంతో.. ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపుకి తీసుకున్నారు.