HYD: నగరంలోని ఐసీఏఆర్-మిల్లెట్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్‌కు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శంకుస్థాపన చేశారు. సిరిధాన్యాల పరిశోధన, అభివృద్ధి, శిక్షణలో ఈ సంస్థ కీలకమని, ప్రపంచవ్యాప్తంగా మిల్లెట్స్ ప్రాముఖ్యతను పెంచుతుందని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి భగీరథ్ చౌదరి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు.
Locations: Hyderabad
-
మహ్మద్ గూడలో ఉచిత వైద్య శిబిరం
HYD: మహ్మద్ గూడ UPHC ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో కార్పొరేటర్ సామల హేమ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీబీ, బీపీ, బ్లడ్ షుగర్, పల్స్ ఆక్సిమీటర్ పరీక్షలు, పోషకాహార కౌన్సిలింగ్ నిర్వహించి, ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డా.ఎలిజబెత్, బీఆర్ఎస్ నాయకులు పింకీ, సంగీత, ANMలు, ASHA కార్యకర్తలు, కమ్యూనిటీ హెల్త్ వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.
-
అక్రమ మద్యం అమ్మకాలు.. మహిళ అరెస్టు
HYD: మల్కాజ్‌గిరిలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలో లీలావేణి అనే మహిళ తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు డిపెన్స్ మద్యం బాటిళ్లను అమ్ముతూ.. రంగారెడ్డి జిల్లా ఏసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎక్సైజ్ బృందానికి పట్టుబడింది. 40బాటిళ్లను సీజ్ చేసి, సీఐ బాలరాజు, ఎస్సై కిరణ్ ఆధ్వర్యంలో మహిళను అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. మద్యంవిలువ రూ.80వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుందని అంచనా.
-
వార్డు కార్యాలయం తొలగింపుపై కలెక్టర్‌కు వినతి
మేడ్చల్: దమ్మాయిగూడ మున్సిపాలిటీలో కీసర వార్డు కార్యాలయాన్ని తొలగించవద్దని కీసర గ్రామపంచాయతీ మాజీ వార్డు సభ్యుడు తుడుం శ్రీనివాస్, కీసరగుట్ట మాజీ ట్రస్ట్ బోర్డ్ సభ్యుడు రాగుల రమేష్ ముదిరాజ్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కీసర గ్రామంలో 20వేల మంది పేదప్రజలు ఇబ్బందులు పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్ర సాయిలు, పండుగ రాజలింగం తదితరులు పాల్గొన్నారు.
-
రెస్టారెంట్‌లో డిప్యూటీ మేయర్ ఆకస్మిక తనిఖీ
HYD: తార్నాక చౌరస్తాలోని డెక్కన్ పామ్ రెస్టారెంట్‌లో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్‌రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కుళ్లిన చికెన్‌తో బిర్యానీ వండుతున్నారన్న ఫిర్యాదులపై సోదాలు చేసి, నాణ్యతలేని ఆహార పదార్థాలను గుర్తించారు. యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఫుడ్ సేఫ్టీ అధికారులకు పరీక్షలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని హోటళ్లపై చట్టపర చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
-
పోచమ్మ దేవాలయంలో ఎమ్మెల్యే పూజలు
HYD: బోయిన్‌పల్లి, బాపూజీ నగర్‌లోని శ్రీ పోచమ్మ దేవాలయ 15వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఆలయ అర్చకులు ఆయనను ఆశీర్వదించి అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.
-
వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం
రంగారెడ్డి: మహేశ్వరం మండలంలోని మనసంపల్లి, రామచంద్రగూడ గ్రామాల్లో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రైతులతో సమావేశమయ్యారు. మే 29నుంచి జూన్ 12వరకు 700 జిల్లాల్లో 1.5కోట్ల మంది రైతులతో సంభాషించి, నూతన సాంకేతికతలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తామని చౌహాన్ తెలిపారు.
-
రైళ్లలో సెల్‌ఫోన్ల దొంగతనాలు.. యువకుడు అరెస్టు
HYD: కాచిగూడ రైల్వే స్టేషన్‌లో సెల్‌ఫోన్ దొంగతనాలకు పాల్పడిన మహమ్మద్ అహ్మద్ మోహినుద్దీన్ అలియాస్ దావూద్(27)ను రైల్వేపోలీసులు అరెస్టు చేశారు. సరూర్‌నగర్‌కు చెందిన దావూద్, సోఫా రిపేర్‌లతో సరిపోని ఆదాయం కారణంగా రైళ్లలో దొంగతనాలు చేసేవాడు. రద్దీస్టేషన్‌లలో ఫోన్లుదొంగిలించి తక్కువ ధరకు అమ్మేవాడు. తనిఖీల్లో అనుమానంతో ఆరా తీయగా, రెండు ఖరీదైన ఫోన్లతో పట్టుబడి, దొంగతనం ఒప్పుకోవడంతో అతన్ని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
-
AJ ఇంటీరియర్స్ ప్రారంభించిన ఛైర్మన్
మేడ్చల్: నాగారం మాజీ మున్సిపల్ ఛైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి సత్యనారాయణ కాలనీ రోడ్ నెంబర్ 12లో AJ ఇంటీరియర్స్‌ను ప్రారంభించారు. యువత స్వయం కృషితో ఉపాధి కల్పించాలని, డిజైనర్ వృత్తిని ఎంచుకున్న డీ.ఆంజనేయులు, డీ.కృష్ణలను అభినందించారు. ఉన్నత విద్య పూర్తి చేసిన యువత వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించాలని సూచించారు. ఈకార్యక్రమంలో బీజీ శ్రీనివాస్ గౌడ్, బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
-
దొంగతనాలపై అవగాహన కార్యక్రమం
మేడ్చల్: చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ రాకేష్, ఏఎస్‌ఐ బీ.అనిల్ కుమార్, సిబ్బందితో కలిసి దొంగతనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రయాణీకులకు భద్రతా చర్యలు, ప్రోటోకాల్‌లపై అవగాహన కల్పించారు. కదులుతున్న రైలును ఎక్కకుండా లేదా దిగకుండా, ఫుట్ ఓవర్‌బ్రిడ్జిలను ఉపయోగించమని సూచించారు. లగేజీని సురక్షితంగా భద్రపరచాలని మార్గనిర్దేశం చేశారు.