Locations: Hyderabad

  • Alert: JNTU పరీక్షలు వాయిదా

    HYD: గణేష్ నిమజ్జనం కారణంగా జేఎన్‌టీయూ హైదరాబాద్ పరిధిలోని ఫార్మా డి మొదటి ఏడాది పరీక్షలు వాయిదా పడ్డాయి. సెప్టెంబర్ 6న జరగాల్సిన ఈ పరీక్షలు సెప్టెంబర్ 17కు మార్చబడ్డాయి. ఈ విషయాన్ని జేఎన్‌టీయూ పరీక్షల విభాగం డైరెక్టర్ డాక్టర్ కె.కృష్ణమోహన్ రావు ప్రకటించారు. పూర్తి వివరాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చని విద్యార్థులకు తెలిపారు.

     

  • గణేష్ నిమజ్జనం.. హైదరాబాద్‌లో హైఅలర్ట్

    గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో రాబోయే 48 గంటలు హైదరాబాద్‌లో యంత్రాంగం హైఅలర్ట్‌గా ఉండనుంది. 303 కిలోమీటర్ల శోభాయాత్ర మార్గంలో రోడ్ల మరమ్మతులు పూర్తయ్యాయి. హుస్సేన్ సాగర్‌లో 40 క్రేన్‌లు ఏర్పాటు చేయగా, ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి ప్రత్యేకంగా బాహుబలి క్రేన్‌ను ఉపయోగిస్తారు. నగరవ్యాప్తంగా 72 కృత్రిమ నిమజ్జన కొలనులను సిద్ధం చేశారు. నిమజ్జన సమయంలో పరిశుభ్రతను కాపాడటానికి 3 షిఫ్టులలో 15 వేల మంది పారిశుద్ధ్య సిబ్బంది పనిచేయనున్నారు.

     

  • గణపతికి ప్రత్యేక పూజలు చేసిన క్రీడాకారిణి నందిని

    మేడ్చల్: కాప్రా ఏఎస్ రావునగర్ డివిజన్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కాప్రాడివిజన్ చంద్రపురి కాలనీలో నివాసం ఉంటున్న భారత క్రీడాకారిణి నందిని అగసర తన నివాసం సమీపంలో ఏర్పాటు చేసిన గణపతికి కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్‌రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి ఆశీస్సులతో నందిని మరిన్ని పతకాలు గెలిచి భారత్ కీర్తిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలని కోరుకున్నారు.

  • ఫుట్‌పాత్‌ పైకి దూసుకెళ్లిన కారు.. ముగ్గిరికి గాయాలు

    రంగారెడ్డి: కడ్తాల్ మండల కేంద్రంలోని హైదరాబాద్-శ్రీశైలం హైవేపై గురువారం కారు హల్ చల్ చేసింది. ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లి చిరు వ్యాపారుల దుకాణాలను ఢీకొట్టి ముగ్గురిని గాయపరిచింది. గమనించిన పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కారును స్వాధీనం చేసుకున్నారు. మార్నింగ్ జనసందడి తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. ఘటనలో చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు.

  • గణపతి మండపంలో కార్పొరేటర్ పూజలు

    HYD: ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్, హనుమాన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడి ఆశీస్సులతో బోయిన్‌పల్లి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం అధ్యక్షులు కర్రె జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

  • టీచర్స్‌ డే.. ఆరోజులు మళ్ళీ రావు!

    HYD: టీచర్స్ డే..అంటే ఒకప్పుడు పాఠశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు చెప్పేవారు. ఈ అనుభవం గురువుల బాధ్యతను, గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడేది. ఉపాధ్యాయులకు బహుమతులు, గ్రీటింగ్ కార్డులు ఇచ్చి కృతజ్ఞత తెలిపేవారు. కానీ డిజిటల్ యుగంలో, టీచర్స్ డే వేడుకలు వాట్సాప్ స్టేటస్‌లు, ఇన్‌స్టాగ్రామ్ పోస్టులకే పరిమితమవుతున్నాయి. ఒకప్పటిలాంటి ఆనందకరమైన, అర్థవంతమైన వేడుకలు ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయాయని చెప్పవచ్చు.

  • బడా గణేశ్ నిమజ్జనం.. అంతా స్పెషలే..!

    HYD: దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ బడా గణనాథుడి నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 69 అడుగుల ఎత్తు ఉన్న శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని తరలించేందుకు విజయవాడ నుంచి ప్రత్యేకంగా భారీ టస్కర్ ట్రక్కును తీసుకొచ్చారు. 100 టన్నుల బరువును కూడా మోయగల ఈ టస్కర్ 75 అడుగుల పొడవు ఉంటుంది. నిమజ్జనం కోసం 100 టన్నుల సామర్థ్యం గల క్రేన్‌ను కూడా సిద్ధం చేశారు.

  • భారీగా పెరిగిన బంగారం ధరలు

    HYD: బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లోని బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 760 పెరిగి రూ.1,07,620గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ. 98,650గా పలుకుతోంది. ఇటు కేజీ వెండి ధర 100 తగ్గి రూ. 1,36,000 వద్ద కొనసాగుతుంది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.

  • HYDలో 1000 ఏళ్ల రామయ్య విగ్రహం

    HYD: శంషాబాద్ పట్టణంలో గల అమ్మపల్లి రామాలయం 13వ శతాబ్దంలో వేంగి రాజులచే నిర్మించబడింది. ఈఆలయ విగ్రహం మాత్రం 1000 సంవత్సరాల పురాతనమైనది. 7అంతస్తుల గోపురం, నల్లటిరాతితో చెక్కిన సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఇక్కడి ప్రత్యేకతలు. హనుమంతుడి విగ్రహం గర్భగుడిలో కాకుండా ధ్వజస్తంభం వద్ద ఉంటుంది. ఇక్కడ ఉన్న కోనేరు చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉంది. టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమకు ఇది ఒక ఇష్టమైన ప్రదేశం.

  • అలర్ట్.. వైద్య పరీక్షలన్ని అక్కడ ఫ్రీ..

    ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లలో వేల రూపాయలు ఖర్చుచేయాల్సిన అవసరం లేకుండా, నగరంలోని ప్రభుత్వాసుపత్రులు, బస్తీ దవాఖానాల్లో 40 రకాల వైద్యపరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. బీపీ, డయాబెటిక్, డెంగీ, టైఫాయిడ్, కొలెస్ట్రాల్, థైరాయిడ్ వంటి ముఖ్యమైన పరీక్షలు వీటిలో ఉన్నాయి. ఈకేంద్రాల్లో ఉదయం నుంచి నమూనాలు సేకరించి, వాటిని నారాయణగూడలోని ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్‌కు పంపుతారు. పరీక్షల ఫలితాలను రోగుల ఫోన్‌ నంబరుకు పంపిస్తారు.