HYD: మియాపూర్‌లోని ప్రశాంత్ నగర్‌లో కంప్రెషర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సూర్యాపేట జిల్లాకు చెందిన ఓర్సు శ్రీను (39) విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. సోమవారం పని చేస్తుండగా బోర్ మోటార్ వైరు ద్వారా షాక్ తగిలింది. తోటి కార్మికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. న్యాయం చేయాలని మృతుడి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు.
Locations: Hyderabad
-
స్థానిక ఎన్నికలకు సహకరించండి: అదనపు కలెక్టర్
వికారాబాద్: స్థానిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ కోరారు. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలపై చర్చించేందుకు ఆయన కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 594 గ్రామ పంచాయతీలకు 5058 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 6,98,478 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇందులో పురుషులు 3,43,672, మహిళలు 3,54,790, ఇతరులు 16 మంది ఉన్నారని పేర్కొన్నారు. అభ్యంతరాలు ఉంటే తెలియజేయవచ్చని సూచించారు.
-
ట్రాన్స్‌ఫారం మరమ్మత్తుల్లో ఆలస్యం: రైతుల ఆందోళన
వికారాబాద్: తాండూరు పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ముందు యాలాల్ మండలం లక్ష్మీనారాయణపూర్ రైతులు నిరసన చేపట్టారు. పది రోజులక్రితం మరమ్మత్తులకు వచ్చిన ట్రాన్స్‌ఫారంను అధికారులు బాగు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల పంటలకు నీరు అందించలేకపోతున్నామని, పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ సబ్ స్టేషన్ గేటుకు అడ్డంగా ట్రాక్టర్‌ను నిలిపి ఆందోళన చేశారు.
-
భూ భారతి దరఖాస్తులను త్వరగా పూర్తి చేయాలి
వికారాబాద్: భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి పూర్తి చేయాలని తహసీల్దార్లకు అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ ఆదేశించారు. దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా, సాధాబైనామ, ఆర్ఓఆర్ వంటి సమస్యలను వేగంగా పరిష్కరించాలని సూచించారు. రేషన్ కార్డుల దరఖాస్తులను కూడా పరిశీలించి, అర్హులకే కార్డులు అందేలా చూడాలని ఆయన తెలిపారు.
-
యువత స్వశక్తితో వ్యాపార రంగంలో రాణించాలి
రంగారెడ్డి: చేవెళ్ల మండలం, అంతారం గ్రామ రెవెన్యూలోని చిట్టంపల్లి గేట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ‘శ్రీ లక్ష్మీనర్సింహస్వామి డిస్పోసల్, లేడీస్ ఎంపోరియం షాప్’ను గ్రామస్థుడు నడికుడె బాలన్నగౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత స్వశక్తితో వ్యాపార రంగంలో రాణిస్తూ ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరేందర్, గ్రామస్థులు పాల్గొన్నారు.
-
‘రైలు కింద పడి విద్యార్థిని మృతి’
HYD: ఘట్‌కేసర్ విజ్ఞాన్ కళాశాలలో B-TECH నాలుగో సంవత్సరం చదువుతున్న దుంపటి హిత వర్షిణి (20) రైలు కిందపడి మృతి చెందింది. మూడు రోజుల క్రితం స్వస్థలానికి వెళ్ళి ఆదివారం రాత్రి తిరిగి వస్తుండగా బీబీనగర్, ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు.
-
అల్లు అర్జున్‌తో మాట్లాడిన కేటీఆర్
దివంగత నటుడు అల్లు రామలింగయ్య సతీమణి, నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ దశదినకర్మ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. కనకరత్నమ్మ చిత్రపటంపై పూలు చల్లి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన అల్లు కుటుంబసభ్యులను పరామర్శించి, అల్లు అర్జున్‌తో మాట్లాడారు.
-
తన భార్యపై కన్ను వేశాడన్న అనుమానంతో హత్య
HYD: మూసీ నదిలో కొట్టుకు వచ్చిన మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. తనభార్యపై కన్ను వేశాడన్న అనుమానంతో స్నేహితుడు షోరబ్‌ను మహమ్మద్ జావిద్, అమీరుల్ హాక్‌తో కలిసి హత్యచేసినట్లు అంబర్‌పేట డీసీపీ బాలస్వామి తెలిపారు. పథకం ప్రకారం మద్యంతాగించి, వైర్లతో ఊపిరి ఆడకుండా చేసి మూసీలో పడవేశారని చెప్పారు. షోరబ్ స్నేహితుడి ఫిర్యాదుతో దర్యాప్తుచేసి ఇద్దరునిందితులను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
-
మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య
మేడ్చల్: ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎదులాబాద్ గ్రామానికి చెందిన ఆముద సంతోష్ (25) ఇంట్లో ఎవరూలేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గత కొంతకాలంగా సంతోష్ మద్యానికి బానిసై, ఎలాంటిపని లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు అతని తల్లి రోజా ఫిర్యాదులో పేర్కొంది. ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
నారాయణగూడలో రద్దైన నోట్ల పట్టివేత
HYD: నారాయణగూడలో ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా రద్దైన నోట్లను పట్టుకున్నారు. శాంతి థియేటర్ ఎదురుగా కెనరా బ్యాంక్ వద్ద ఇద్దరిని, వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న మూడు బ్యాగుల్లో రెండు కోట్ల రూపాయల విలువైన రద్దైన 500, 1000 నోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.