ఎన్టీఆర్: విజయవాడలో డూండీ గణేష్ సేవా సమితి తీర్చిదిద్దిన.. 72 అడుగుల కార్యసిద్ధి మహాశక్తి పర్యావరణ హిత గణపతి విగ్రహ నిమజ్జనం శనివారం వైభవంగా నిర్వహించారు. విగ్రహం లోపల ముందే అమర్చిన పైపులతోపాటు..ఫైరింజన్ల ద్వారా నీటిని పంపి క్రతువు పూర్తి చేశారు. జన హృదయాల్లో కొలువైన భారీ గణనాథుడిని.. వేలాది భక్తులు తరలిరాగా.. విశేష కీర్తనలు, ప్రత్యేక పూజల నడుమ నిమజ్జనం చేశారు. డూండీ గణేశ్ సేవా సమితి పర్యవేక్షించగా, పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు.
Locations: Krishna
-
నేడు విజయవాడ దుర్గగుడి మూసివేత
ఎన్టీఆర్: చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు దుర్గగుడి కవాట బంధనంతో ఆలయం మూసివేస్తారని ఈవో శీనానాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం కవాట బంధనం చేసిన తర్వాత ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు, లడ్డు, పులిహోర, అన్నప్రసాద తయారీ కేంద్రాలను కూడా మూసివేస్తారని పేర్కొన్నారు. 8న అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ, హారతి అనంతరం సర్వదర్శనాన్ని ఉదయం 8:30 గంటలకు భక్తులను అనుమతిస్తారని తెలిపారు.
-
భూపతి దంపతులకు ఎమ్మెల్యే పరామర్శ
ఎన్టీఆర్: నందిగామ పట్టణంలోని 2వ వార్డులో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన దామాల భూపతి, సౌజన్య దంపతులను వారి స్వగృహంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరామర్శించారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి, కూటమి నేతలతో కలిసి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.
-
ఘనంగా గణపతి నిమజ్జనం
ఎన్టీఆర్: నందిగామ పట్టణంలోని వాసవి మార్కెట్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా రూ. 3కోట్ల 10 లక్షల కరెన్సీ నోట్లతో అద్భుతంగా అలంకరింపబడిన గణనాథుడి విగ్రహం శనివారం రాత్రి నిమజ్జన యాత్రకు శోభాయమానంగా బయలుదేరింది. ఈ యాత్రను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
-
వినాయక నిమజ్జనంలో ఘర్షణపై ఏసీపీ కీలక కామెంట్
ఎన్టీఆర్: కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో వినాయక నిమజ్జన ఊరేగింపులో జరిగిన ఘర్షణలపై నందిగామ డివిజన్ ఏసీపీ తిలక్ స్పందించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని ఆయన తెలిపారు. ఘర్షణకు కారణమైన సమస్యను 24 గంటల్లోగా పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి అదుపులో ఉందని వెల్లడించారు.
-
గంగమ్మ ఒడికి గండిగుంట బాల గణేష్
కృష్ణా: గండిగుంట పంచాయతీ వెంకటాపురంలో ఏర్పాటు చేసిన బాలగణేష్ గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. శనివారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నిమజ్జనానికి ముఖ్యఅతిథిగా ఉయ్యూరు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కొండా ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. గణేష్‌ను ఉంచిన ట్రాక్టర్‌ను ఆయన స్వయంగా నడిపి ఘన వీడ్కోలు పలికారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఛైర్మన్ ఆకాంక్షించారు. ఊరేగింపు ఉత్సాహంగా సాగింది.
-
కొండపల్లిలో గణనాథుడికి ఘనంగా వీడ్కోలు
ఎన్టీఆర్: కొండపల్లిలోని సిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి ఘనంగా వీడ్కోలు పలికారు. విగ్రహ ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమంలో కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, జనసేన పార్టీ అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్ రావు, బొర్రా కిరణ్ పాల్గొన్నారు. కమిటీ సభ్యులు అతిథులను సత్కరించారు.
-
గొట్టుముక్కల గ్రామంలో ఘనంగా వినాయక నిమజ్జనం
ఎన్టీఆర్: కంచికచర్ల మండలం, గొట్టుముక్కల గ్రామంలో శ్రీ బాల వినాయక ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన మండపంలో గణేష్ నిమజ్జనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కోగంటి బాబు పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం గణపతి లడ్డు వేలం నిర్వహించగా, అది రూ. 29,116 పలికింది. అదే గ్రామానికి చెందిన బండ్లమూడి శ్రీనివాసరావు తండ్రి సూర్యం లడ్డును దక్కించుకున్నారు. అనంతరం డీజే, బాణాసంచా మధ్య గణపతి విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించారు.
-
కృష్ణా జిల్లా పోలీస్ శాఖలోకి నూతన జాగిలం విక్టర్
కృష్ణా జిల్లా పోలీస్ శాఖలోకి విక్టర్ అనే కొత్త పోలీస్ జాగిలం చేరింది. 11 నెలల శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో మూడవ స్థానం సాధించింది. సాధారణంగా ఒక జాగిలం ఒక అంశంలో మాత్రమే ప్రతిభ కనబరుస్తుంది. అయితే విక్టర్ నేరస్తులను పట్టుకోవడం, పేలుడు పదార్థాలు గుర్తించడంలో నైపుణ్యం ఉంది. జిల్లాలో రెండు లక్షణాలు కలిగిన మొదటి జాగిలం ఇదే అని ఎస్పీ ఆర్. గంగాధరరావు తెలిపారు.
-
రెడ్డిగూడెం మండలంలో ఘనంగా గణేష్ నిమజ్జనం
ఎన్టీఆర్: రెడ్డిగూడెం మండలంలోని పలు గ్రామాలలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర శనివారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. నిమజ్జనాల చివరి రోజు కావడంతో కుదప, మద్దులపర్వ, అన్నరావుపేట, ముచ్చినపల్లి గ్రామాలలో ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై వినాయక విగ్రహాలను ఊరేగించారు. ఈ ఉత్సవాలలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం పలుచోట్ల అన్న సమారాధన కార్యక్రమాలు కూడా నిర్వహించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.