Locations: Krishna

  • పేదల ఆరోగ్య సంరక్షణే కూటమి లక్ష్యం: ఎమ్మెల్యే

    కృష్ణా: పేదల ఆరోగ్య సంరక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. గుడివాడలోని ప్రజా వేదిక కార్యాలయంలో లబ్దిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 37 మందికి రూ.20,42,048 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే బాధిత కుటుంబాలకు అందజేశారు.

     

  • ‘అర్హులైన దివ్యాంగుల పింఛన్లు తొలగిస్తే ఉద్యమిస్తాం’

    కృష్ణా: అర్హులైన దివ్యాంగుల పింఛన్లు తొలగిస్తే ఉద్యమిస్తామని దివ్యాంగ హక్కుల జాతీయ వేదిక జిల్లా కార్యదర్శి సత్యనారాయణ ఒక ప్రకటనలో హెచ్చరించారు. అనర్హులైన దివ్యాంగులకు పింఛన్లను తొలగిస్తే స్వాగతిస్తామని, కానీ అర్హులవి కూడా తొలగిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో ఇప్పటి వరకు 3987 మంది దివ్యాంగులకు నోటీసులు పంపారన్నారు. అర్హత ఉండి పింఛను కోల్పోయిన దివ్యాంగులు 9291902360 నంబర్‌కు సమాచారమిస్తే వారి తరఫున కమిటీ పోరాడుతుందని పేర్కొన్నారు.

  • చింతగుంటలో వ్యక్తి హత్య.. ఆలస్యంగా వెలుగులోకి!

    కృష్ణా: గన్నవరం మండలం చిక్కవరం గ్రామ శివారు చింతగుంటలో ఆలస్యంగా హత్య కథనం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన డోలా లక్ష్మణ్‌కుమార్ ఈనెల 10న హార్ట్‌ఎటాక్‌తో మరణించారని సమాచారం. అయితే లక్ష్మణ్‌కుమార్ భార్య బిందుకు వివాహేతర సంబంధం ఉందని, ఆమె ప్రియుడితో కలిసి తమ కొడుకును హత్య చేసిందని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై రీపోస్టుమార్టం చేయాలని అధికారులను వారు ఆశ్రయించారు.

     

  • నూజివీడులో వాహన తనిఖీలు

    ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, నూజివీడు డీఎస్పీ ప్రసాద్ ఆదేశాలతో రూరల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ సిబ్బందితో కలిసి రహదారి ప్రమాదాల నివారణ, అక్రమ రవాణా నిర్మూలన కోసం వాహన తనిఖీలు నిర్వహించారు. ‘ఫేస్ వాష్ కార్యక్రమం’ ద్వారా నిద్రమత్తులో డ్రైవింగ్ ప్రమాదాలను వివరించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి అని, మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయకూడదని ఆయన సూచించారు.

  • ‘కాంగ్రెస్ అతి తెలివి రాజకీయాలకు కాలం చెల్లింది’

    ఎన్టీఆర్: కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంలో ఓట్లు గెలవలేక, ఈవీఎంలపై ఆరోపణలు చేస్తూ ఎన్నికల సంఘాన్ని, బీజేపీని లక్ష్యంగా చేసుకుని అవినీతితో దేశాన్ని నాశనం చేసిందని బీజేపీ సీనియర్ నాయకుడు కేదార్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును బీజేపీ నుంచి విడగొట్టి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి మద్దతు డిమాండ్ చేయడం కాంగ్రెస్ విభజన రాజకీయమని విమర్శించారు. కాంగ్రెస్ అతితెలివి రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు.

  • వరద పెరుగుతోంది..సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి

    ఎన్టీఆర్: కృష్ణానదికి పెద్దఎత్తున పైనుంచి వరద వస్తున్నందున పరివాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఓ ప్రకటనలో కోరారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్న కారణంగా శ్రీశైలం జలాశయం నిండుతుండడంతో పాటు పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రవాహం పెరుగుతుందని, స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని ఆయన కోరారు.

  • పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మహిళ మృతి

    కృష్ణా: పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని వివాహిత మృతి చెందిన సంఘటన ఉంగుటూరు మండలం ఆత్కూరు వద్ద చోటుచేసుకుంది. మండలంలోని పొట్టిపాడుకు చెందిన చిక్కవరపు లక్ష్మి(29) అనే మహిళ కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతోంది. మంగళవారం ఇంటి నుంచి బయటకొచ్చిన ఆమె..పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న రైల్వేపోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  • డోకిపర్రులో బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్‌ను ప్రారంభించిన మిస్ వరల్డ్

    కృష్ణా: గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలో మిస్ వరల్డ్ ఓపల్ సుచాతా చుయాంగ్‌స్రీ, మిస్ ఏషియా క్రిష్ణా గ్రావిడెజ్ సందడి చేశారు. గ్రామంలో సుధారెడ్డి ఫౌండేషన్, మెయిల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్‌ను వారు ప్రారంభించారు. గ్రామీణ మహిళల ఆరోగ్య కార్యక్రమాలను సుచాతా ప్రశంసించారు. మహిళలతో కరచాలనం చేసి, గోశాలలో గోవులకు మేత తినిపించారు.
  • ఓటు చోరీపై నందిగామలో కొవ్వుత్తుల ర్యాలీ

    ఎన్టీఆర్: ఓటు చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి నందిగామ కాంగ్రెస్ నేతలు మద్ధతు పలికారు. మంగళవారం గాంధీ సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ నందిగామ ఇన్‌ఛార్జ్ మందా వజ్రయ్య ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. ఏకపక్షంగా నిరంకుశ వైఖరితో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న కారణంగా దేశంలో ప్రజాస్వామ్య విలువలు మంటకలిసి పోతున్నాయని వజ్రయ్య ఆరోపించారు. నాయకులు గింజుపల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు.

  • మచిలీపట్నంలో టీడీపీ ఎమ్మెల్యే ఫొటో దగ్ధం చేసిన NTR ఫ్యాన్స్

    కృష్ణా: హీరో జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మంగళవారం మచిలీపట్నంలోని ఎన్టీఆర్ విగ్రహం ఎదుట ఎమ్మెల్యే ఫోటోను అభిమానులు చెప్పులతో కొట్టి దగ్ధం చేసి నిరసన తెలిపారు. అలాగే ఎన్టీఆర్ ఫోటోలకు గుమ్మడికాయతో దిష్టితీసి కొబ్బరికాయలు కొట్టారు. దగ్గుపాటి బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే రోజుకో రీతిలో నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు.