
ఎన్టీఆర్: నందిగామలో ఆర్టీసీ బస్సులు మహిళలతో కిటకిటలాడుతున్నాయి. కంచికచర్ల బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్ సౌకర్యం కల్పించడంతో మహిళలు అధికంగా బస్ ప్రయాణం వైపే ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఎక్కువగా రద్దీ ఉండటంతో గంటల తరబడి మరో బస్సు కోసం వేచిచూడాల్సిన పరిస్థితి వచ్చిందని మహిళలు వాపోతున్నారు. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని కోరుతున్నారు.
ఎన్టీఆర్: నదిపరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇబ్రహీంపట్నం తహశీల్దార్ వై.వెంకటేశ్వర్లు సూచించారు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. వరదనీరు 6లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశముండటంతో తీర ప్రాంతవాసులను, లోతట్టు ప్రాంతవాసులను వెంటనే తమ నివాసాలను వదిలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రీహాబిలిటేషన్ సెంటర్స్‌లో ఆశ్రయం పొందాలని తహశీల్దార్ సూచించారు.
ఎన్టీఆర్: జగ్గయ్యపేట మండలంలోని కృష్ణానది పరివాహక ప్రాంతలైన రావిరాల, వేదాద్రి ప్రాంత మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా రావిరాల ప్రాంతం వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. దీంతో అక్కడి మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని పంచాయితీ, పోలీస్ అధికారులు హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలన్నారు.
AP : ముసురుకున్న వాతావరణంతో విజయవాడ నగరంలోని కొండ ప్రాంతాల ప్రజలు గజగజలాడుతున్నారు. నగర జనాభాలో 30శాతం మంది కొండపైనే జీవిస్తున్నారు. ముసురు పట్టినా, నాలుగైదు రోజులు వర్షాలు కురిసినా కొండ ప్రాంతాలు వణికి పోవాల్సిందే. ఇక్కడి ప్రజలకు రక్షణ కల్పించటానికి రిటెయినింగ్ వాల్స్ మాత్రమే పరిష్కారం. ఈ దిశగా అధికార యంత్రాంగాలు ఎప్పుడు కదులుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.
ఏలూరు: నూజివీడు నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్లే ప్రధాన రహదారి పోతిరెడ్డిపల్లి సెంటర్ వద్ద రహదారి గుంతల మయంగా తయారైంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని వాహనాలు రాకపోకలతో ఈ మార్గం అత్యంత రద్దీగా ఉంటుంది. ప్రయాణ సమయంలో గుంతలు తప్పించే క్రమంలో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు పేర్కొన్నారు. అధికారులు స్పందించి వెంటనే గుంతలను పూడ్చాలని కోరుతున్నారు.
ఎన్టీఆర్: వీరులపాడు మండలం దాములూరు శివారు కూడలి వద్ద వైరా, కట్టలేరులో వరద ప్రవాహం కొనసాగుతుంది. కూడలి- పల్లంపల్లి చప్టా మీదుగా గత ఏడు రోజులుగా రాకపోకలు నిలిచాయి. దీంతో నందిగామ, వీరులపాడు మండలాల్లోని 40గ్రామాల ప్రజలు రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు. వరద తగ్గకపోవడంతో ఏరు దాటి పంట పొలాలకు వెళ్లలేని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు.
ఎన్టీఆర్: నందిగామ డివిజన్‌లో సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు 77.0మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వత్సవాయిలో 22.2మి.మీ., జగ్గయ్యపేటలో 11.8మి.మీ., పెనుగంచిప్రోలులో 12.8మి.మీ., నందిగామలో 3.6మి.మీ., వీరులపాడులో 16.8మి.మీ., కంచికచర్లలో 7.0మి.మీ., చందర్లపాడులో 2.8మి.మీ.,నమోదైంది. డివిజన్‌లో సగటుగా 11.0మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఎన్టీఆర్: మైలవరం మండలం తోలుకోడులో మంగళవారం ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పొలం పనుల నిమిత్తం వెళ్తున్న ట్రాక్టర్ రోడ్డుపై ఏర్పడిన బారి గుంత కారణంగా అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. రోడ్డుపై గుంతలు పూడ్చేవరకు ఇలాంటి ప్రమాదాలు తప్పవని, ప్రాణాలు పోవడం ఖాయమని స్థానికులు వాపోయారు. అధికారులు స్పందించి రోడ్డు మరమమ్మతుల చేపట్టాలన్నారు.