Locations: Krishna

  • తిరుపతమ్మ ఆలయం మూసివేత

    ఎన్టీఆర్: పెనుగంచిప్రోలులో శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయ ఆలయ ద్వారాలు మూసేసి భక్తుల దర్శనం నిలిపివేశారు. ఆదివారం రాత్రి చంద్రగ్రహణం సందర్భంగా దర్శనం నిలిపివేసినట్లు ఆలయాధికారులు తెలిపారు. మరలా సోమవారం ఉదయం 8 గంటల తర్వాత అమ్మవారి దర్శనం ప్రారంభిస్తామని ప్రకటించారు.

  • ‘అన్న‌దాత పోరు’కు త‌ర‌లిరండి

    కృష్ణా: రైతాంగ సమస్యలపై పోరాడేందుకు ఈ నెల 9వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీవో కార్యాలయాల ఎదుట ‘అన్నదాత పోరు’ పేరుతో శాంతియుత నిరసన నిర్వహిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను గుడివాడలోని వైసీపీ నాయకులు ఆవిష్కరించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరసన తెలియజేయడమే కార్యక్రమం లక్ష్యమని జిల్లా అధికారి ప్రతినిధి నారాయణరెడ్డి, నందివాడ మండలం ఎంపీపీ ఆదం, తదితరులు తెలిపారు.

  • పరిటాల గొడవను అదుపు చేయడంలో విఫలమైన పోలీసులు!

    కృష్ణా: కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో వినాయక నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా జరిగిన రాళ్ల దాడిలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. గొడవ జరుగుతుందని ముందుగా ఎస్సై ఎందుకు గుర్తించలేకపోయారని, స్పెషల్ బ్రాంచ్ నిఘా ఏమైందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సంబంధం లేని వ్యక్తులు గుంపుగా రోడ్డుపైకి వచ్చినప్పుడు ఎస్సై ఎందుకు వెంటనే స్పందించలేదని, తగినంత భద్రత ఎందుకు కల్పించలేదని వినాయక భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం

    కృష్ణా: పెడనలోని 22వ వార్డులో గల తాడిశెట్టి సత్యనారాయణ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు క్షణాల్లోనే వ్యాపించి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడగా, వారి ఆస్తి పూర్తిగా కాలిపోయింది. సర్వం కోల్పోయిన ఆ కుటుంబం కన్నీరుమున్నీరైంది.

     

  • పురుషోత్తపట్నంలో కలెక్టర్ పర్యటన

    కృష్ణా: గన్నవరం మండలం పురుషోత్తపట్నంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పర్యటించి యూరియా రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులు సుమారు 2,600 ఎకరాలు ఆయా కట్టు సాగు చేశామని, యూరియా కొరత బాగా ఉందని, యూరియా కోసం రోజుల తరబడి సొసైటీలు చుట్టు తిరుగుతున్నామని కలెక్టర్‌తో వాపోయారు. అనంతరం సొసైటీ యూరియా స్టోర్‌ను, స్టాక్ రిజిస్టర్‌ను అడిగి తెలుసుకున్నారు.

  • నందిగామ నియోజకవర్గంలో యూరియా కొరత లేదు

    ఎన్టీఆర్: నందిగామ నియోజకవర్గంలో యూరియా కొరత లేదని వ్యవసాయశాఖ అధికారులు స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చెందవద్దని, ప్రస్తుతం 235 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. కంచికచర్లలో 65, వీరులపాడులో 45, చందర్లపాడులో 60, నందిగామలో 65 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలు నమ్మకుండా, రైతులు సమీపంలోని ప్రాథమిక సహకార సంఘాల వద్ద యూరియా తీసుకోవచ్చని అధికారులు సూచించారు.

     

     

  • మోపిదేవి సన్నిధిలో హరి హరనాథ్ శర్మ

    కృష్ణా: మోపిదేవిలోని శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తి హరి హరనాథ్ శర్మ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆయన నాగపుట్టలో పాలు పోసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ ప్రసాదాలు, చిత్రపటం అందజేసి, జస్టిస్ కుటుంబ సభ్యులను సత్కరించారు.

     

  • మందుబాబులకు అడ్డాగా కంచికచర్ల ఆర్టీసీ బస్టాండ్

    ఎన్టీఆర్: కంచికచర్ల ఆర్టీసీ బస్టాండ్ మందుబాబులకు అడ్డాగా మారింది. రాత్రి 9 దాటితే బస్టాండ్ ఆవరణలో కొందరు వ్యక్తులు మద్యం సేవించి కుర్చీలపై పడుకుంటున్నారు. మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు కూడా వారు అక్కడి నుంచి కదలకపోవడంతో ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

     

  • రాళ్ల దాడిలో పగిలిన తలలు.. పోలీసులపై విమర్శలు

    కృష్ణా: కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మరో మతానికి చెందిన వారు రాళ్ల దాడి చేయడంతో నిమజ్జన యాత్రలో పాల్గొన్న పలువురి తలలకు గాయాలయ్యాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు చూస్తూ ఉండిపోయారని, భద్రతా లోపం వల్లే ఇలా జరిగిందని భక్తులు ఆరోపిస్తున్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకునే వరకు ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు.

  • అధ్వాన రోడ్డుతో అవస్థలు!

    ఎన్టీఆర్: కంచికచర్ల నుంచి గొట్టుముక్కల మధ్య రోడ్డు నిర్మాణం నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 500 మీటర్ల మేర రోడ్డు నిర్మాణo జరపాల్సి ఉన్నప్పటికీ నిధులు లేవని అధికారులు పనులు నిలిపివేశారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు బాగు చేస్తామని ప్రకటించినా, తమ గ్రామాల రోడ్లను పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.