Locations: Krishna

  • వినాయక నిమజ్జనం వేళ రెండు వర్గాల ఘర్షణ

    కృష్ణా: కంచికచర్ల మండలం, పరిటాల గ్రామంలో వినాయక నిమజ్జన ఊరేగింపులో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఓ మతానికి చెందిన ప్రార్థనా మందిరం వద్ద  పెద్ద శబ్దంతో పాటలు పెట్టారని  అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వినాయక కమిటీ సభ్యులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉంది.

  • వెరైటీగా క్రేన్‌తో వినాయకుడి ఊరేగింపు

    ఎన్టీఆర్: జగ్గయ్యపేట పట్టణంలో వినాయక చవితి తొమ్మిదో రోజు సందర్భంగా గణనాథుల నిమజ్జనం ఘనంగా ప్రారంభమైంది. వినూత్నంగా క్రేన్ సాయంతో ఏర్పాటు చేసిన గణపతి శోభాయాత్ర భక్తులను ఆకట్టుకుంది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో భక్తులు, ప్రజలు నిమజ్జనం ఊరేగింపులో పాల్గొన్నారు. జై గణేష్, జై జై గణేష్ అంటూ నినాదాలతో పట్టణం మారుమోగింది.

  • ఇమామ్‌, మౌజన్‌ల గౌరవ వేతనాల విడుదలకు డిమాండ్

    కృష్ణా: ఇమామ్‌లు, మౌజన్‌ల పెండింగ్ గౌరవ వేతనాలను వెంటనే విడుదల చేయాలని మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఖాశీం డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ మైనార్టీ సెల్ పిలుపు మేరకు సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మైనార్టీ నాయకులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు.

  • సీఎం చంద్రబాబుతో వసంత నాగేశ్వరరావు భేటీ

    ఎన్టీఆర్:  సీనియర్ రాజకీయ నేత వసంత నాగేశ్వరరావు  సీఎం చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌తో కలిసి పనిచేసిన నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. పార్టీ బలోపేతానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని చంద్రబాబు కోరగా, తన వంతు కృషి చేస్తానని వసంత నాగేశ్వరరావు తెలిపారు.

  • యూరియా స్టాక్ పరిశీలించిన ఆర్డీవో

    ఎన్టీఆర్: నందిగామ ఆర్డీవో బాలకృష్ణ కంచికచర్ల మండలం పరిటాల పీఏసీఎస్‌లో యూరియా పంపిణీని పరిశీలించారు. రైతులకు యూరియా సరఫరా సజావుగా సాగుతోందని ఆయన తెలిపారు. మండలంలోని సొసైటీల్లో యూరియా నిల్వలు తగినంత ఉన్నాయని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉంచామని చెప్పారు. అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆర్డీవో సూచించారు.

  • ఉత్సాహంగా గణేష్ నిమజ్జనం

    కృష్ణా: గుడివాడ పట్టణంలోని శ్రీరాంపురంలో ఉన్న శ్రీ బాలగణపతి స్వామివారి నిమజ్జన ఊరేగింపు శోభాయమానంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన వేలంలో స్వామివారి ఉత్సవ లడ్డూలు రికార్డు స్థాయిలో రూ. 2.34 లక్షలు పలికాయి. స్వామివారి చేతిలో ఉన్న రెండు కిలోల లడ్డూను ఒక భక్తురాలు రూ. 1.15 లక్షలకు దక్కించుకున్నారు. ఊరేగింపు పట్టణంలోని పురవీధుల్లో ఘనంగా సాగింది.

  • ‘సాంకేతికతతో మహిళలు ప్రపంచ మార్కెట్‌లో రాణించాలి’

    ఎన్టీఆర్: ప్రతి కుటుంబంలో ఒక మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దే లక్ష్యంతో, స్వయం సహాయక బృందాల మహిళలకు ‘AI for SURE’ కార్యక్రమం ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తమ ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్‌లో అమ్ముకోవాలని ఆయన మహిళలకు సూచించారు.

  • వినాయక మండపంలో కంచికచర్ల సీఐ పూజలు

    ఎన్టీఆర్: కంచికచర్ల పట్టణంలోని సెంట్రల్ బ్యాంక్ రోడ్‌లోని గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన మండపంలో కంచికచర్ల సీఐ చవాన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని సీఐ చవాన్‌తో పాటు పీఏసీఎస్ చైర్మన్ గుత్తా రత్నం ప్రారంభించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులకు పంటలు బాగా పండాలని ఈ సందర్భంగా సీఐ చవాన్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

  • బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని వినతి

    ఎన్టీఆర్: జి. కొండూరు మండలం కట్టుబడిపాలెం గ్రామం, ఎన్టీఆర్ కాలనీ వద్ద బస్ స్టాప్‌ను ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా ఉపాధ్యక్షుడు బొలియశెట్టి శ్రీకాంత్ కోరారు. ఈ మేరకు ఆయన కట్టుబడిపాలెం నాయకులతో కలిసి ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ వేణు గోపాల్‌కు వినతిపత్రం సమర్పించారు. దీనిపై డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించి త్వరలో బస్ స్టాప్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

     

  • ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట.. బెయిల్ మంజూరు

    తూర్పుగోదావరి: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కొంచం ఊరట లభించింది. ఆయనకు విజయవాడ ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు స్వీకరించింది. తిరిగి ఈనెల 11న కోర్టులో సరెండర్ కావాలని షరతు విధించింది.