Locations: Krishna

  • ‘యాదవుల ద్రోహి కొడాలి నాని’

    కృష్ణా: గుడివాడలో రాజకీయ పరిస్థితులు వేడెక్కాయి. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో యాదవ నేతల సమావేశం జరిగింది. మాజీమంత్రులు కొడాలి నాని, కటారి ఈశ్వర్‌‌కుమార్‌పై నాయకులు మండిపడ్డారు. యాదవుల ద్రోహి కొడాలి నాని అని పేర్కొన్నారు. కొడాలి నానికి కటారి మద్దతివ్వడం ఏమిటని ప్రశ్నించారు. యాదవ సంఘం ఎవరికీ బానిస కాదని, బీసీలకు న్యాయం చేసేవారికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

  • హారికపై దాడి.. నిందితులను శిక్షించాలి!

    కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఉప్పాల హారికపై జరిగిన దాడిని నిరసిస్తూ పలు జిల్లాలకు చెందిన జడ్పీటీసీ సభ్యులు పెడన మండలం కృష్ణాపురంలోని హారిక నివాసానికి బుధవారం చేరుకున్నారు. ప్రజా ప్రతినిధులపై దాడులను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం విచారణ చేపట్టి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

  • ఢీకొట్టుకున్న ఆటోలు.. ఒకరికి సీరియస్

    కృష్ణా: పులిగడ్డ టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొట్టుకోవడంతో ఆరుగురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమించటంతో మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు. చెక్‌పోస్ట్ వద్ద పండ్ల దుకాణాలు ఉండటంతో రద్దీ కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలు గుర్తించి అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

  • కనికరించండి.. కనీస వేతనాలు పెంచండి!

    ఎన్టీఆర్: కొండపల్లి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాల పెంచాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ.. కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, సంక్షేమ పథకాలు, తల్లికి వందనం పథకం మున్సిపల్ వర్కర్స్‌కి కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరారు.

  • మచిలీపట్నంలో జాబ్ మేళాకు గుడ్ రెస్పాన్స్

    కృష్ణా: మచిలీపట్నంలో ప్రారంభమైన మెగా జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించింది. మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాల మేరకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మేళా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి మంత్రి కొల్లు మేళాను ప్రారంభించారు. సుమారు 30కార్పొరేట్ కంపెనీలు మేళాలో పాల్గొన్నాయి. సుమారు 1500మందికి పైగా యువత తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు అధికారులు తెలిపారు.

  • రియల్ ఎస్టేట్ సంస్థలకు షాకిచ్చిన రెరా తీర్పు

    ఎన్టీఆర్: ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(ఏపీ రెరా) సంచలన తీర్పుతో రియల్ ఎస్టేట్ సంస్థలకు షాక్ తగలగా.. కేతనకొండ హౌసింగ్ సొసైటీ వ్యవహారంలో కొనుగోలుదారులకు ఊరట లభించింది. అదనపు వసూళ్లు చేయకూడదని, ప్లాట్లను వెంటనే అప్పగించాలని రెరా ఆదేశించింది. సొసైటీల బై-లాస్.. రెరా నిబంధనలకు వ్యతిరేకంగా ఉండకూడదని తేల్చిచెప్పింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని రెరా హెచ్చరించింది.

  • లోకో షెడ్‌లో ప్రమాదం.. కార్మికుడికి గాయాలు

    ఎన్టీఆర్: కొండపల్లిలోని నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రం (ఎన్టీటీపీఎస్) లోకో షెడ్‌లో ప్రమాదం జరిగింది. నూజివీడు ప్రాంతానికి చెందిన గోపి అనే కార్మికుడికి గాయాలయ్యాయి. పని చేస్తుండగా చెక్క పడటంతో గోపి చేతికి తీవ్ర గాయాలయ్యాయని కార్మికులు తెలిపారు. ప్రస్తుతం క్షతగాత్రుడు ఎన్టీటీపీఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు.

  • మిస్టరీగా ఏడేళ్ల బాలుడి అదృశ్యం

    కృష్ణా: తోట్లవల్లూరు మండలం రొయ్యూరులో ఏడేళ్ల బాలుడు పటమట నిదీష్ ఆచూకీ ఇంకా లభించలేదు. నాలుగు రోజులైనా బాలుడి ఆచూకీ దొరకపోవడంతో పోలీసులకు సవాలుగా మారింది. నాలుగు బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ చిట్టిబాబు తెలిపారు. ఒకవేళ కాలువలో పడి చనిపోకపోతే కేసు ఊహించని మలుపు తిరిగే అవకాశం ఉందన్నారు. కాల్‌డేటాను, కేసును అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

  • VTPSలో ప్రమాదం.. నిర్లక్ష్యమే కారణం?

    ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నంలోని విజయవాడ థర్మల్ పవర్‌స్టేషన్‌(VTPS)లో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. క్రాష్‌హౌస్‌‌లో బొగ్గు కుప్పకూలి ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం క్షతగాత్రులు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత 20రోజులుగా లైనర్ ప్లేట్స్ సరిగ్గా లేవని ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసినప్పటికీ..వారు పట్టించుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఘటనపై విచారణ జరపాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

     

  • ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సింహాద్రి

    కృష్ణా: అవనిగడ్డలోని మానేపల్లి టవర్స్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని బుధవారం మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పరిశీలించి బాధితులను పరామర్శించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. అగ్నిప్రమాద బాధితులకు ధైర్యం చెప్పారు. ఆయన వెంట ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజలు తదితరులు ఉన్నారు.