Locations: Krishna

  • సిల్వర్ షోరూమ్ ప్రారంభించిన మంత్రి లోకేష్

    గుంటూరు: మంగళగిరికి చెందిన వ్యాపారవేత్త చల్లా నాగరాజు విజయవాడ గవర్నర్ పేటలోని ఎఫ్ఎమ్ ప్లాజాలో నూతనంగా దేవి ధామ్ సిల్వర్ షోరూమ్ ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథుగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌, APMSIDC చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొని ప్రారంభించారు. అనంతరం దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్‌ను మంత్రి సందర్శించారు.

  • కంకర లారీ అదుపుతప్పి బోల్తా!

    ఎన్టీఆర్: కంకర లారీ అదుపుతప్పి హైవే పక్కన కాలువలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టిన సంఘటన పశ్చిమ ఇబ్రహీంపట్నం సెవెంత్ డే స్కూల్ సమీపంలో చోటుచేసుకుంది. పరిమితికి మించి కంకర రావాణా చేయడంతోనే ఘటన జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • ఉయ్యూరులో అగ్నిప్రమాదం

    కృష్ణా: ఉయ్యూరు కేసీపీ కాలనీలో అగ్నిప్రమాదం సంభవించింది. చెత్తకు నిప్పు అంటుకోవడంతో మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు పెద్తఎత్తున కమ్ముకోవడంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించిన ఇంకా రాలేదని ప్రజలు వాపోతున్నారు.

  • కుట్రలు పన్నుతున్న వైసీపీ నేతలు: దేవినేని ఉమా

    ఎన్టీఆర్: జగన్, వైసీపీ నేతలు తీవ్రఫ్రస్టేషన్‌లో ఉన్నారని, దీంతో రాష్ట్రంలో గందరగోళం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శలు గుప్పించారు. పల్నాడు, బంగారుపాళ్యం, గుడివాడ వంటి ఘటనలు జగన్ కుతంత్రాల్లో భాగమేనని ఆరోపించారు. చంద్రబాబు, ఇతర నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సానుభూతి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారిస్తోందని తెలిపారు.

  • రోడ్డు మరమ్మతులు చేపట్టాలి: సీపీఎం

    ఎన్టీఆర్: రెడ్డిగూడెం మండలం రంగాపురం గ్రామ పంచాయతీ శివారు తాడిగూడెం నుంచి నరుకుళ్ళపాడు గ్రామానికి వెళ్లే రహదారిలో రోడ్డు అధ్వాన్నంగా మారి ప్రయాణీకులు అవస్థలు పడుతున్నారని  సీపీఎం సీనియర్ నాయకులు మాధవరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల కార్యదర్శి వీరాస్వామి, రైతులతో కలిసి రోడ్డు దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

  • తులసీరత్నం సేవానిరతి చిరస్మరణీయం: ఎమ్మెల్యే

    కృష్ణా: తులసీరత్నం సేవానిరతి చిరస్మరణీయమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. చల్లపల్లి మండలం పురిటిగడ్డ గ్రామానికి చెందిన ప్రముఖ సంఘ సేవకురాలు నాదెళ్ల తులసీరత్నం మృతి చెందగా..వారి కుమారుడు విశ్రాంత రవాణా శాఖ అధికారి నాదెళ్ల శివరామకృష్ణను ఎమ్మెల్యే పరామర్శించారు. తులసీరత్నం మృతి పట్ల సంతాపం తెలిపారు. అనంతరం వక్కలగడ్డ గ్రామంలో టీడీపీ నేత విజయసారథిని పరామర్శించి, ఆరోగ్యపరిస్థిని అడిగి తెలుసుకున్నారు.

     

  • ఈనెల 19 నుంచి జిల్లాస్థాయి యోగాసన పోటీలు

    కృష్ణా: ఈ నెల 19న ఉయ్యూరు మండలం గండిగుంటలోని దత్త కళ్యాణ మండపంలో జిల్లాస్థాయి యోగాసన పోటీలు జరగనున్నాయి. యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ అవనిగడ్డ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు జిల్లా ప్రెసిడెంట్ యోగా గురువు గురువెల్లి కృష్ణ తెలిపారు. ఎంపికైన వారు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. వివరాలకు డయల్ 9502876748 ని సంప్రదించాలని సూచించారు.

  • కాలువల ఆక్రమణ.. రైతుల ఆవేదన

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలం పరిటాల రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలోని నాగార్జునసాగర్, ఇబ్రహీంపట్నం మేజర్ కాలువ, కాచేటి వాగులను క్వారీ, క్రషర్ యజమానులు ఆక్రమించారని సోమవారం ఆర్డీవోకు ఇచ్చిన వినతిపత్రంలో రైతులు పేర్కొన్నారు. కాలువ కట్టను పూడ్చి, మెటల్, మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని, ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా ప్రభుత్వం నుంచి స్పందనలేదని వాపోయారు. దీనిపై ఉన్నత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 
  • సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేవలో సిక్కిం మాజీ గవర్నర్‌ సతీమణి

    కృష్ణా: మోపిదేవిలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సిక్కిం మాజీ గవర్నర్‌ రామారావు సతీమణి, వారి కుటుంబ సభ్యులు సోమవారం దర్శించుకున్నారు. వీరిని ఆలయ మర్యాదలతో ఆలయ అధికారి శ్రీరామ వరప్రసాదరావు ఘనంగా సత్కరించి, ప్రసాదాలను అందజేసి, స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు.

  • ప్రజా సమస్యలపై సీపీఎం పోరాటం

    ఎన్టీఆర్: విస్సన్నపేటలో దోమలు, కుక్కలు, కోతుల బెడద ఎక్కువైందని సీపీఎం మండల కార్యదర్శి నాగరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజారోగ్యం, పిల్లల భద్రత కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో ఎంపీడీవో చిన్నరాట్నాలు, గ్రామపంచాయతీ ఈవో హరికృష్ణ కుమార్‌లకు వినతిపత్రం అందజేశారు. దోమల నివారణకు స్ప్రేయింగ్ చేయాలని, కుక్కలు, కోతులను అదుపు చేయాలని డిమాండ్ చేశారు.