కృష్ణా: రాష్ట్ర ప్రభుత్వం రోశయ్యకు సముచిత స్మారకం నిర్మించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. శుక్రవారం అవనిగడ్డలో ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ దివంగత కొణిజేటి రోశయ్య జయంతి ఘనంగా జరిగింది. రోశయ్య విగ్రహానికి బుద్ధప్రసాద్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రానికి, ప్రత్యేకించి దివిసీమకు రోశయ్య చేసిన సేవలు స్మరించుకున్నారు.
Locations: Krishna
-
‘కరెంట్ సమస్యను త్వరలో పరిష్కరిస్తా’
కృష్ణా: ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా పెడన పట్టణం 9వ వార్డు, మొగ్గయ్య కాలనీలో ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. స్థానికులతో సమావేశమై, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి, ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కరెంట్ సరఫరా సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
-
మన్యం వీరుడికి నివాళులర్పించిన ఎమ్మెల్యే
కృష్ణా: బంటుమిల్లి మండలం మణిమేశ్వరం గ్రామంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి ఆ యోధునికి పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
-
విజయవాడలో CPM పోరుబాట
ఎన్టీఆర్: విజయవాడలో CPM ఆధ్వర్యంలో శుక్రవారం పోరుబాట నిర్వహించారు. స్మార్ట్ మీటర్లు, విద్యుత్ భారాలపై నిరసిస్తూ ధర్నా చేపట్టారు. పవర్(విద్యుత్) జోలికొస్తే.. పవర్(అధికారం) పోతుంది.. తస్మాత్ జాగ్రత్త అంటూ నేతలు హెచ్చరించారు. ఆదానికి, మోదీకి చంద్రబాబు, పవన్, జగన్ దాసోహం అయ్యారని విమర్శించారు. కూటమి సర్కార్ మాటతప్పి రూ.15వేల కోట్ల విద్యుత్ భారాలు మోపిందని ఆరోపించారు. సిహెచ్ బాబురావు, డి.కాశీనాథ్, తదితరులు పాల్గొన్నారు.
-
‘అల్లూరి జీవితం యువతకు ఆదర్శనీయం’
ఎన్టీఆర్: నందిగామ రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి బాలకృష్ణ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్డీఓ మాట్లాడుతూ.. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సశస్త్ర పోరాటం చేసిన అల్లూరి దేశ గర్వకారణమని అన్నారు. యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని పేర్కొన్నారు.
-
‘రోశయ్య సమర్థవంతంగా పరిపాలన చేశారు’
ఎన్టీఆర్: తిరువూరులోని రాజీవ్ భవన్‌లో మాజీ సీఎం స్వర్గీయ కొణిజేటి రోశయ్య 92వ జయంతి ఘనంగా నిర్వహించారు. తిరువూరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్డు ప్రకాష్ రావు మాట్లాడుతూ.. రోశయ్య 16సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి, మంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్‌గా సమర్థవంతంగా పరిపాలన చేశారని కొనియాడారు. తిరువూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లిపాటి శ్రీనివాసరావు ఆయన సేవలను స్మరించారు.
-
కీసర-గండేపల్లి రోడ్డు మరమ్మతులపై ఆందోళన
ఎన్టీఆర్: కంచికచర్ల మండలం కీసర నుంచి గండేపల్లి వెళ్లే రోడ్డు గుంతలతో దెబ్బతినడంతో జిల్లా కలెక్టర్ లక్ష్మిషా తక్షణ మరమ్మతులకు ఆదేశించారు. శుక్రవారం పనులు ప్రారంభమైనప్పటికీ, నామమాత్రంగా జరుగుతున్నాయని గండేపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. భారీ వాహనాల వల్ల రోడ్డు దెబ్బతిన్నదని, గుంతలను శాశ్వతంగా పటిష్టంగా పూడ్చాలని కోరారు. దీంతో మరమ్మతు పనులు నిలిచిపోయాయి.
-
5న జగన్నాథస్వామి రథయాత్ర
కృష్ణా: ఈనెల 5వ తేదీన మచిలీపట్నంలో నిర్వహించనున్న జగన్నాథ స్వామివారి రథయాత్రను జయప్రదం చేయాలని స్థానిక చాకిరేవుపాలెంలోని జగన్నాథస్వామి మందిరం నిర్వాహకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం కోరారు. రథయాత్రకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. మధ్యాహ్నం 2.30నిమిషాలకు నిజాంపేటలోని బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయ నుంచి నగర వీధులగుండా జగన్నాథస్వామి మందిరం వరకు రథయాత్ర జరుగుతుందన్నారు.
-
మంత్రి వివేక్‌కు ఉప్పులేటి విషెస్
ఎన్టీఆర్: తెలంగాణ కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(RPI) ఆంధ్రప్రదేశ్ ఛీప్ డా.ఉప్పులేటి దేవి ప్రసాద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని మంత్రి స్వగృహంలో కలిసి నూతనంగా బాధ్యతలు స్వీకరించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉప్పులేటిని మంత్రి ఆత్మీయంగా కౌగిలించుకుని సంతోషాన్ని వ్యక్త పరిచారు.
-
‘రంగా సేవలు భవిష్యత్తు తరాలకు ఆదర్శం’
కృష్ణా: గుడివాడలో టీడీపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన రంగా 78వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, రంగా విగ్రహానికి నివాళులర్పించి, అన్నదానం, సేవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రంగా సేవలు భవిష్యత్తు తరాలకు ఆదర్శమని, ఆయన త్యాగాలు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.