Locations: Krishna

  • రేపు మద్దులమ్మకు వరదపాశం

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామ సమీపంలోని రిజర్వు ఫారెస్ట్‌లో స్వయంభుగా వెలసిన మద్దులమ్మకు గ్రామస్తులు ఆదివారం వరదపాశం పోయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి పరిటాల, నక్కలం పేట, కంచికచర్ల, నరసింహారావు పాలెం గ్రామాలతో పాటు పలు గ్రామాలు ప్రజలు హాజరుకానున్నారు. వర్ష ప్రదాయిని అయిన మద్దులమ్మ తల్లికి వరదపాశం పోస్తే వర్షాలు కురుస్తాయని ఇక్కడి స్థానికుల నమ్మకం.

  • విజేతలకు శ్రీరాం తాతయ్య సత్కారం

    ఎన్టీఆర్: ఒంగోలులో గత నెల 31 నుంచి ఈనెల 2 వరకు పురుషులు, మహిళలకు 12వ సబ్-జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ పవర్‌లిఫ్టింగ్, బెంచ్ ప్రెస్ ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. జగ్గయ్యపేటకు చెందిన జి.వెంకటేశ్వరావు మాస్టర్స్ గోల్డ్ మెడల్ & స్ట్రాంగ్ మెన్ టైటిల్, ఎస్.ప్రహర్షిణి సబ్ జూనియర్ గోల్డ్ మెడల్ సాధించారు. వీరితో పాటు పతకాలు సాధించిన విజేతలను ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య శనివారం సత్కరించారు.

  • చెస్ ఇన్ స్కూల్‌లో చెవిటికల్లు గ్రామ వాసి ఉత్తమ ప్రతిభ

    ఎన్టీఆర్: ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్క్రాట్స్ ఫైన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఈనెల 3,4 తేదీల్లో చెస్ ఇన్ స్కూల్ సెమినార్ నిర్వహించారు. కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామానికి చెందిన చెస్ కోచ్ గుజ్జర్లపూడి చెన్నకేశవులు అత్యుత్తమ ప్రతిభ కనపరచాడు. సందర్భంగా గుజరాత్‌కు చెందిన ఇండియన్ చెస్ 11వ గ్రాండ్ మాస్టర్ తేజెస్ బక్రీ కేశవులును ఘనంగా సన్మానించారు. షీల్డ్, ప్రశంశా పత్రంతో అభినందించారు.

  • తిరుపతమ్మకు వెండి చెంబు వితరణ

    ఎన్టీఆర్: పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవస్థానానికి లింగగూడెం గ్రామానికి చెందిన మాదినేని నాగేష్ కుటుంబ సభ్యులు శనివారం 100 గ్రాములు మిశ్రమ వెండి చెంబు వితరణ చేశారు. వీరికి దేవస్థానం ఏఈఓ, టెంపుల్ ఇన్స్‌పెక్టర్ అమ్మవారి దర్శన ఏర్పాటు చేశారు. వేద పండితులచే వేద ఆశీర్వచనం అమ్మవారి శేష వస్త్రములు, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

  • త్యాగానికి ప్రతి రూపమే బక్రీద్‌: దేవీ ప్రసాద్

    ఎన్టీఆర్: ముస్లిం సోదర, సోదరీణులకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(RPI) ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, మాజీ IRS ఆఫీసర్ ఉప్పులేటి దేవీప్రసాద్ బక్రీద్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్‌ త్యాగానికి ప్రతీకని చెప్పారు. ఉన్న దానిలో ఇతరులకు పంచి పెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని బక్రీద్ నేర్పుతుందన్నారు. సమస్యలకు వెరవకుండా, దేవుడిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనాన్ని సాగించాలనే సందేశం ఇస్తుందని వెల్లడించారు.

  • ఇంద్రకీలాద్రిపై ‘యోగాంధ్ర’

    ఎన్టీఆర్: ఇంద్రకీలాద్రిపై శనివారం ఉదయం ‘యోగాంధ్ర’ జరిగింది. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా మానసిక ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని, దీనిని నిత్యచర్యగా అలవాటు చేసుకోవాలని దుర్గగుడి ఈవో శీనా నాయక్ సూచించారు. ఈ కార్యక్రమం ఆలయ వాతావరణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

     

  • బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

    కృష్ణా: బక్రీద్ పర్వదినం సందర్భంగా పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ నాయకులతో కలిసి పట్టణంలోని ఈద్గాలో జరిగిన బక్రీద్ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం త్యాగానికి మారుపేరుగా నిలిచే ఈ పవిత్రమైన పర్వదినాన్ని ఎంతో వేడుకగా జరుపుకోవాలని ఆకాంశిస్తూ..ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు, తదితరులు పాల్గొన్నారు.

  • శానిటేషన్ పనుల పరిశీలన

    కృష్ణా: పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా పెడనలోని భట్ట జ్ఞాన కోటయ్య జిల్లా పరిషత్ హైస్కూల్‌లో జరిగే శానిటేషన్ పనులను కౌన్సిలర్ సతీష్‌ బాబు పర్యవేక్షించారు. పాఠశాల ప్రాంగణమంతా పరిశుభ్రం చేయించి, బ్లీచింగ్ చల్లించారు. కార్యక్రమంలో శానిటేషన్ ఇన్‌ఛార్జి హరి కిశోర్, నాంచారయ్య పాల్గొన్నారు.

  • టీడీపీ నాయకులపై కేసు కొట్టివేత

    కృష్ణా: రెండేళ్ల క్రితం చల్లపల్లి సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారిపై అప్పటి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు పరుషంగా మాట్లాడినందుకు నిరసనగా టీడీపీ నాయకులపై అక్రమంగా నమోదైన కేసును అవనిగడ్డ కోర్టు శనివారం కొట్టివేసింది. మాజీ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, టీడీపీ నేతలు కొల్లూరి వెంకటేశ్వరరావు, యాసం చిట్టిబాబు, సుధాకర్, తదితరులు కృష్ణకుమారికి మద్దతుగా నిరసన చేపట్టారు. న్యాయమూర్తి విచారణ అనంతరం తీర్పు వెలువరించారు.

     

  • నిత్యాన్నదాన పథకానికి విరాళం

    కృష్ణా: మోపిదేవిలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిత్యాన్నదాన పథకానికి తిరుపతి వాస్తవ్యులు విరాళం అందజేశారు. శ్రీధర్, విజయభాను దంపతులు వారి కుమార్తె హరిణి పేరు మీద రూ.1,00,001 డిప్యూటీ కమిషనర్, ఆలయ కార్యనిర్వాహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావుకు అందజేశారు. అనంతరం దాతలను ఆలయ మర్యాదలతో సత్కరించారు.