కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్ నుంచి మోపిదేవి తహశీల్దార్‌గా నియమితులైన హరనాథ్ గురువారం సాయంత్రం బాధ్యతలను చేపట్టారు. తహశీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన హరనాథ్‌ను మండల రెవెన్యూ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తహశీల్దార్ హరనాథ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
Locations: Krishna
-
చెరువును తలపించేలా కంచికచర్ల..!
ఎన్టీఆర్: భారీ వర్షాలతో కంచికచర్ల చెరువులా నిండిపోయింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక వరదనీరు జుజ్జూరు రోడ్డు, బస్టాండ్‌లోకి చేరుతోంది. వర్షాలు కొనసాగితే ఇళ్లలోకి నీరు వచ్చే ప్రమాదమని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పైనుంచి వచ్చే వరదనీరు చెరువులోకి పోకుండా రోడ్లపై ప్రవహిస్తోందని ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం స్పందించి, జుజ్జూరు రోడ్డులోని తూములను తొలగించి కల్వర్టు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
-
చెక్కపల్లిలో చీకటిలో రోడ్లు.. ప్రజల ఆవేదన
ఏలూరు: ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో వీధిలైట్లు వెలగక రోడ్లు చీకటిమయంగా మారింది. డ్రైనేజీ వ్యవస్థ లోపం వల్ల రోడ్డుపై నీరు, బురద చేరి ప్రజలు నడవలేని దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. సంబంధిత అధికారులు తక్షణం స్పందించి, వీధిలైట్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని చెక్కపల్లి ప్రజలు కోరుతున్నారు.
-
ఛోటా న్యూస్ ఎఫెక్ట్.. దూసరపాలెంలో డ్రైనేజీలు క్లీన్
కృష్ణా: ‘విలేజ్‌లో విష జ్వరాలు’ అనే శీర్షికతో ఛోటా న్యూస్‌లో గురువారం ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ముదునూరు గ్రామం దూసరపాలెంలో రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని పారిశుధ్య కార్మికులు గంటల వ్యవధిలోనే తొలగించారు. సమస్యపై వెంటనే రియాక్ట్ అయ్యి క్లీన్ చేయాలని ఆదేశించి తాత్కాలికంగా పరిష్కారం చూపిన ఉయ్యూరు ఎంపీడీవో శేషగిరిరావుకు స్థానికులు థాంక్స్ చెప్పారు.
-
‘సేనతో సేనాని’ సభ విజయవంతం చేయాలి: వెంకట్రామ్
కృష్ణా: ఈనెల 30వ తేదీ విశాఖలో జరిగే ‘సేనతో సేనాని’ సభ విజయవంతం చేయాలని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ కోరారు. గురువారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ సభ సందర్భంగా సన్నాహకాలపై పార్టీ క్రియా వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. విశాఖ వెళ్లేందుకు చేస్తున్న ఏర్పాట్లు వివరించారు. ఈ సభలో క్రియా వాలంటీర్లకు జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఇచ్చే ఆదేశాలు,మార్గదర్శకాలు ఇస్తారని తెలిపారు.
-
విద్యుత్ సబ్ స్టేషన్‌ను ప్రారంభించిన మంత్రి
కృష్ణా: బందరు మండలం రుద్రవరం గ్రామంలో నిర్మించిన టిడ్కో గృహాల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్‌ను మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ప్రారంభించారు. టిడ్కో గృహ సముదాయాల వద్ద లబ్ధిదారులకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే విద్యుత్ సబ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
-
పెడనలో ఘనంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు
కృష్ణా: పెడన పట్టణంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో అద్భుతంగా జరుగుతున్నాయి. గణపతి నామస్మరణలతో భక్తులు భక్తిశ్రద్ధలతో నవరాత్రులను జరుపుకుంటున్నారు. 16వ వార్డులోని రౌతులవారి వీధిలో శ్రీలక్ష్మీ గణపతి మండపం విద్యుత్ దీపాలు, అందమైన అలంకరణలతో ఆకర్షణీయంగా నిలుస్తోంది. రౌతుల కుటుంబం రుచికరమైన తీర్థప్రసాదాలతో భక్తులకు ఆతిథ్యమిస్తూ ప్రశంసలు పొందుతోంది. ఈ ఉత్సవాలు పట్టణ ప్రజలకు మరపురాని అనుభూతిని అందిస్తున్నాయి.
-
‘క్వాంటం వ్యాలీతో పుష్కలంగా ఉపాధి అవకాశాలు’
కృష్ణా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న క్వాంటం వ్యాలీతో పుష్కలంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాంజీ అన్నారు. వర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన ఇంటర్ హ్యాకాథన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. క్వాంటం వ్యాలీ కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దమొత్తంలో నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అమరావతికి అత్యంత సమీపంలో కృష్ణా విశ్వవిద్యాలయం ఉండటం ఒక శుభపరిణామం అన్నారు.
-
‘చేనేత హస్తకళ ప్రదర్శన.. సద్వినియోగం చేసుకోండి’
బాపట్ల: విజయవాడ బందర్ రోడ్డులోని రాఘవయ్య పార్క్ ఎదురుగా బాపు మ్యూజియంలో చేనేత హస్తకళ ప్రదర్శన, అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు అందే శ్రీను తెలిపారు. చెరుకుపల్లిలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శ్రావణమాసం, వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 14 వరకు ప్రదర్శన జరుగుతుందని, 10% తగ్గింపు, పాత పట్టు జరీ చీరల విక్రయ అవకాశం ఉందని, స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
-
భారీ వర్షాల వల్ల మంచినీటి కష్టాలు..!
ఎన్టీఆర్: నందిగామ పురపాలక సంఘం పరిధిలో భారీ వర్షాలు, మున్నేరు స్కీమ్ వద్ద వరదల కారణంగా మోటార్లు ఆన్ చేయలేక మంచినీటి సమస్య ఏర్పడిందని మున్సిపల్ కమిషనర్ లోవరాజు తెలిపారు. నీటి ప్రవాహం తగ్గిన వెంటనే మోటార్లను రిపేర్ చేసి నీటి సరఫరా చేస్తామని, ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు నీటిని కాచి తాగాలని సూచించారు.