నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రంలోని గణేష్ మండపాల నిర్వాహకులు శనివారం సమావేశమయ్యారు. గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా, అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించుకోవాలని వారు తీర్మానించారు. గతంలో కేసరి సముద్రం చెరువులో నిమజ్జనం చేసేవారని, ఇప్పుడు నాగనూల్ చెరువులో ఏర్పాటు చేశారని, కానీ అక్కడ బురద, పాములు వంటి సమస్యలు ఉన్నాయని తెలిపారు. దీనిపై ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్‌లకు వినతిపత్రం సమర్పించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
Locations: నాగర్ కర్నూల్
-
గుండెపోటుతో యువకుడి మృతి
నారాయణపేట: ముందు రోజు రాత్రి తన అన్న కూతురి పుట్టినరోజు సరదాగా జరిపి వేడుకలు చేసుకున్న వ్యక్తి హఠాత్తుగా మరణించడంతో తీవ్రవిషాదం నెలకొంది. కృష్ణ మండలం గుడెబల్లూర్‌కు చెందిన చిట్యాల వెంకటేష్(32) దినసరి కూలీ. స్నేహితులతో సరదాగా గడిపిన ఇతను శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందడంతో బంధువులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడుకి భార్య, ఇద్దరు పిల్లలున్నారని, ప్రభుత్వపరంగా ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
-
మల్లారెడ్డి కాలేజీ టాపర్‌గా మరికల్ విద్యార్థిని
నాగర్‌కర్నూల్: తిమ్మాజీపేట మండలం మరికల్ గ్రామానికి చెందిన సర్వగల సంధ్య హైదరాబాదులోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఫార్మ్‌డీ విద్యను అభ్యసించి కాలేజీ టాపర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆమె తల్లిదండ్రుల సమక్షంలో యూనివర్సిటీ ఛైర్మన్ మల్లారెడ్డి ఆమెకు అవార్డును అందజేశారు. అనంతరం ప్రశంసా పత్రం కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు.
-
ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న ఎంపీ
వనపర్తి: హైదరాబాద్‌లో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ ఎంపీ డి.కె. అరుణ తన కుటుంబ సభ్యులతో కలిసి ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలందరికీ గణపతి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
-
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
జోగులాంబ గద్వాల: అప్పుల బాధలు తాళలేక ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. పట్టణ ఎస్సై కల్యాణ్ కుమార్ వివరాల మేరకు.. గద్వాల పిల్లిగుండ్ల కాలనీలో నివాసముంటున్న రాజు(35) అప్పులు చేసి వాటిని తీర్చలేక మనస్తాపంతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య నాగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
-
అనారోగ్య సమస్యలతో యువతి ఆత్మహత్య
నాగర్‌కర్నూల్: మనస్తాపానికి గురై ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కందనూలు మండలంలోని శ్రీపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై గోవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అనురాధ (19) తల్లి లక్ష్మమ్మతో కలిసి పట్టణంలోని న్యూటీచర్స్ కాలనీలో ఉంటోంది. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఫ్యానుకు ఉరివేసుకొని ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
-
రైతును చెంపకేసి కొట్టిన ఎస్సై!
మహబూబ్‌నగర్: మరికల్ మండలం తీలేరులోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు భారీగా తరలిరావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపు చేసే క్రమంలో ఎస్సై రాము ఓ రైతుపై చేయిచేసుకున్నారు. యూరియా అడిగితే చేయి చేసుకుంటారా అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
-
జూరాల ప్రాజెక్టకు భారీ వరద
జోగులాంబ గద్వాల: జూరాల ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. ప్రాజెక్ట్‌లోని 21 గేట్లను ఎత్తి అధికారులు 1,82,966 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం వైపు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 318.110 మీటర్ల నీటి సామర్థ్యం ఉంది, పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 318.516 మీటర్లు. లోయర్ జూరాలలో 4, అప్పర్ జూరాలలో 6 విద్యుత్ యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది..
-
ఏడాదికి రెండు సార్లు రక్తదానం చేయాలి: కలెక్టర్
నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రంలో దేవిటిక్యాల వార్డు యువత, రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రారంభించారు. రక్తదానం చేయటం అత్యున్నతమైన సేవ అని, యువత ఇలాంటి కార్యక్రమాల్లో ముందుండాలని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ ఏడాదికి రెండు సార్లు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-
కలెక్టరేట్ ఎదుట కార్మికుల ధర్నా
నాగర్‌కర్నూల్: జిల్లా కలెక్టరేట్ ఎదుట గ్రామపంచాయతీ కార్మికులు ధర్నా చేశారు. వేతనాలు పెంచి, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదని సీఐటీయూ నాయకులు ఆర్.శ్రీనివాసులు విమర్శించారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని, అదనపు పనికి అదనపు వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.